Telugu Gateway
Andhra Pradesh

లాక్ డౌన్ వేళ తిరుమలలో సుబ్బారెడ్డి దర్శన వివాదం

లాక్ డౌన్ వేళ తిరుమలలో సుబ్బారెడ్డి దర్శన వివాదం
X

తిరుమలలో ప్రస్తుతం భక్తులకు దర్శనాలు నిలిపివేశారు. కారణం కరోనా వైరస్. లాక్ డౌన్. గతంలో ఎన్నడూ లేని విధంగా గత కొన్ని రోజులుగా తిరుమలలో దర్శనాలు నిలిచిపోయాయి. కాకపోతే ప్రతి రోజూ తిరుమల వెంకటేశ్వరస్వామికి పూజారులు మాత్రం శాస్త్రోక్తంగా పూజలు నిర్వహిస్తున్నారు. లాక్ డౌన్ వేళ తాజాగా టీటీడీ ఛైర్మన్ వై వీ సుబ్బారెడ్డి కుటుంబ సభ్యులతో కలసి స్వామి వారి దర్శనం చేసుకోవటం వివాదంగా మారింది. రూల్స్ భక్తులకేనా?. ఛైర్మన్ కు వర్తించవా అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలు లాక్ డౌన్ వేళ కుటుంబ సభ్యులతో కలసి అంత దూరం ప్రయాణించటం ఒకెత్తు అయితే...టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డి ప్రత్యేక దర్శనం దుమారం రేపుతోంది. సోషల్ మీడియాలో దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సహజంగా అయితే టీటీడీ ఛైర్మన్ దర్శనం పెద్ద అంశం కాదు. కానీ దేశంలో ఎక్కడా దేవాలయాల్లో దర్శనాలు లేని సమయంలో అందునా కుటుంబ సభ్యులతో కలసి ఆయన దర్శనం చేసుకోవటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఛైర్మన్ సహా అయినా..టీటీడీ బోర్డు సభ్యులకు ప్రత్యేక వెసులుబాట్లు ఉన్నా అవి కూడా నిర్దేశిత సమయంలోనే ఉంటాయని చెబుతున్నారు. ఛైర్మన్ సుబ్బారెడ్డి పుట్టిన రోజు సందర్భంగా మే1న ఆయన ఇలా ప్రత్యక దర్శనం చేసుకున్నారు.

ఈ ఫోటోలు ఇఫ్పుడు సోషల్ మీడయాలో వైరల్ గా మారాయి. దీనిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి లోకేష్ కూడా స్పందించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో సుబ్బారెడ్డి విమర్శలు చేశారు. ‘‘ఆప‌ద‌మొక్కులవాడా! అనాథ‌ర‌క్ష‌కా! నీకూ పేదా, పెద్ద తేడాల్లేవంటారు. వైర‌స్ వ్యాప్తి చెందుతున్న ఈ కాలంలో సామాన్యుల‌కు నీ ద‌ర్శ‌న‌భాగ్య‌మే లేదు. వైఎస్ తోడల్లుడు(వైవీ సుబ్బారెడ్డి) స‌కుటుంబ స‌మేతంగా వ‌చ్చేస‌రికి నీ గుడి త‌లుపులు ఎలా తెరిచార‌య్యా!’’ అని ప్రశ్నించారు. ‘‘దేవ‌ దేవుడు ఉత్స‌వాల‌తో అల‌రారిన తిరుమ‌ల‌గిరులు నిర్మానుష్యంగా మారిన‌వేళ‌ నిబంధ‌న‌లు తుంగ‌లోతొక్కి నీ స‌న్నిధిలో పుట్టిన‌రోజు వేడుక‌లు జ‌రుపుకోవ‌డం అప‌రాధం కాదా! ఏడుకొండ‌లే లేవ‌న్నోళ్లు.. నువ్వున్నావంటే న‌మ్ముతారా? నీ కొండ‌ను నువ్వే కాపాడుకో స్వామీ!’’ అంటూ ట్విట్టర్‌లో సుబ్బారెడ్డి తీరును తప్పుపట్టారు.

Next Story
Share it