బాబు నిర్ణయాలు ఎన్నో రివర్స్ చేసి...కోటిన్నర భూముల దగ్గర....!

తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తలపెట్టిన రాజధాని ‘అమరావతి’నే వద్దన్నారు. చంద్రబాబు ఎంపిక చేసిన పోలవరం కాంట్రాక్టర్ పనికిరాడన్నారు. అందులో స్కామ్ జరిగిందని చెప్పారు. చంద్రబాబు ఆలోచనలో అన్నీ స్కామ్ లే..దురాలోచనతో చేసినవే అన్నారు. మేం మాత్రం పక్కా ప్రజాశ్రేయస్సుతో..ప్రజల మంచి కోసమే అన్నారు. అందులో తప్పుపట్టాల్సి ఏమీలేదు. గత టీడీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో ఎన్నింటినో జగన్మోహన్ రెడ్డి సర్కారు ‘రద్దుల’ బాట పట్టించింది. అధికారంలో ఎవరు ఉంటే వాళ్ల నిర్ణయాలే ఫైనల్. అందులో మంచి చెడులను నిర్ణయించాల్సింది ఎన్నికల సమయంలో ప్రజలు మాత్రమే. నిజమే..చంద్రబాబు జమానాలోనే..చంద్రబాబు నియమించిన చదలవాడ కృష్ణమూర్తి టీటీడీ ఛైర్మన్ గా ఉన్న సమయంలోనే తమిళనాడుతో సహా దేశంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న ఆస్తులను అమ్మేయాలని నిర్ణయించారు. టీటీడీ చైర్మన్ వై వీ సుబ్బారెడ్డి చెప్పినట్లు జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత నియమించిన కొత్త బోర్డు తీసుకున్న నిర్ణయం కాదు. అందులో ఎలాంటి సందేహం లేదు.
గత చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న వేల కోట్ల రూపాయలతో కూడిన పనులను ఎంతో తేలిగ్గా రద్దు చేసిన సర్కారులో..కోట్లాది మంది భక్తుల మనోభావాలతో కూడిన దాతలు ఇఛ్చిన భూముల విషయంలో మాత్రం ఎందుకు ముందుకెళ్ళాలని నిర్ణయించుకున్నారు. అసలు చంద్రబాబు నియమించిన బోర్డు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవటం ఏమిటి?. వాటిని మనం అమలు చేయటం ఏమిటి?. దేవుడి ఆస్తులు కాపాడాలి కానీ..ఈ కరోనా సమయంలో ముందుకెళ్లేలా ఎందుకు చర్యలు తీసుకోవాలనే ఆలోచన ప్రస్తుత బోర్డుకు ఎందుకు రాలేదు?. ఈ అంశం పెద్ద వివాదంగా మారిన తర్వాత..తూచ్ ఇది మేం తీసుకున్న నిర్ణయం కాదు..చంద్రబాబు హయాంలోనే...అప్పటి బోర్డు నిర్ణయమే..మేం ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని ఇప్పుడు తాపీగా ప్రకటించటంలోనే తేడా ఉందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికైనా సమీక్ష చేస్తాం అన్న ప్రకటన రావటం సంతోషకర పరిణామమే.