Telugu Gateway
Andhra Pradesh

చంద్రబాబు..నారా లోకేష్ హైదరాబాద్ ను వీడరా?!

చంద్రబాబు..నారా లోకేష్ హైదరాబాద్ ను  వీడరా?!
X

సామాన్య ప్రజలే పాస్ లు తీసుకుని ఏపీకి వెళుతున్నారు. అలాంటిది ప్రతిపక్ష నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ నారా లోకేష్ ఏపీకి వెళ్ళలేరా?. హైదరాబాద్ లో ఇంకెంత కాలం ఉంటారు వీళ్ళు?. ఇదీ రాజకీయ వర్గాల్లో సాగుతున్న చర్చ. మరీ లాక్ డౌన్ తొలి రోజుల్లో అంటే నిబంధనలు ఉల్లంఘించి పోవాల్సిన అవసరం లేదు. కానీ ఇఫ్పుడు పరిస్థితులు మారిపోయాయి. ఇప్పటికే పరిమిత సంఖ్యలో రైళ్ళకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. త్వరలోనే దేశీయ విమాన సర్వీసులకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇవ్వబోతున్నారు. నిజంగా ఇఫ్పుడు చంద్రబాబు, నారా లోకేష్ లు ఏపీకి వెళతామంటే సర్కారు ఏమైనా అడ్డుకుంటుందా?. అంటే ఆ ఛాన్సే ఉండదు. మహా అయితే టెస్ట్ చేసి పధ్నాలుగు రోజుల పాటు కరకట్ట నివాసం నుంచి బయటకు రావొద్దంటారు. హైదరాబాద్ లో ఉంటూ విశాఖపట్నంలో జరిగిన ఎల్ జీ పాలిమర్స్ ప్రమాద బాధితులను పరామర్శించేందుకు వెళతానని, అందుకు అనుమతి ఇవ్వాలంటూ చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారు. కేంద్రం నుంచి ఇప్పటివరకూ ఎలాంటి స్పందన లేదు. టీడీపీ నేతల బృందం అయితే ఎల్జీ పాలిమర్స్ బాధితులను పరామర్శించింది.

కానీ ఏపీ అసెంబ్లీలో ఒక్కరంటే ఒక్క ఎమ్మెల్యే కూడా లేని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విశాఖపట్నం వెళ్లి ఎల్ జీ పాలిమర్స్ బాధితులను పరామర్శించి వచ్చారు. అంటే చంద్రబాబునాయుడు విశాఖపట్నం వెళ్లటానికి అయితే రెడీ అయ్యారు కానీ..అమరావతి వెళ్ళటానికి మాత్రం ఆసక్తి చూపటంలేదని స్పష్టం అవుతోంది. నిజంగా కేంద్రం అనుమతి ఇచ్చినా కూడా విశాఖ వెళ్ళి అమరావతి వెళ్ళాలి కానీ..మళ్ళీ హైదరాబాద్ వస్తారా?. అయితే చంద్రబాబు అనుమతి కోరుతూ రాసిన లేఖ అలాగే ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో ప్రతిపక్ష నేత జగన్ హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో కూర్చుని ఏపీపై విమర్శలు చేస్తారా? అంటూ ప్రశ్నించిన నేతలు ఇప్పుడు ఏమి సమాధానం చెబుతారు?. నిజంగా చంద్రబాబు ఏపీలో ఉండి ఉంటే నేరుగా వైజాగ్ వెళ్ళటానికి ఎవరూ అభ్యంతరాలు చెప్పే అవకాశమే ఉండేది కాదు.

Next Story
Share it