Telugu Gateway
Andhra Pradesh

కరోనా పరీక్షల్లో ఏపీనే ఫస్ట్

కరోనా పరీక్షల్లో ఏపీనే ఫస్ట్
X

కరోనా వస్తుందని ఎవరూ ఖంగారు పడాల్సిన అవసరం లేదని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. అది కూడా జ్వరం లాంటిదే అని..మందులు వేసుకుంటే తగ్గిపోతుందని తెలిపారు. కరోనా పరీక్షల విషయంలో దేశంలోనే ఏపీ మొదటిస్థానంలో ఉందని అన్నారు. ‘కరోనా కట్టడికి యుద్ధప్రాతిపదికన అడుగులు వేశాం. 70 రోజుల్లోనే 13 జిల్లాల్లో ల్యాబ్‌లను అందుబాటులోకి తెచ్చాం. రోజుకు 11వేల పరీక్షలు నిర్వహించే సామర్థ్యాన్ని పెంచుకున్నాం. మిలియన్‌కు 6,627 పరీక్షలు చేస్తూ.. దేశంలోనే ప్రథమ స్థానంలో ఉన్నాం. దేశంలో పాజిటివిటీ రేటు 4.71శాతం కాగా.. ఏపీలో 0.97 మాత్రమే. దేశంలో రికవరి రేటు 42.75 శాతం కాగా.. ఏపీలో 65.49 శాతం. దేశంలో మరణాల రేటు 2.86 శాతం కాగా.. ఏపీలో 1.82శాతం. కరోనా రోగులను వివక్షతతో చూడాల్సిన అవసరం లేదు. ప్రజల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఉంది. రాష్ట్రస్థాయిలో 5 కోవిడ్‌ ఆస్పత్రులను ఏర్పాటు చేశాం. 65 జిల్లాస్థాయి ఆస్పత్రులను కూడా అందుబాటులోకి తెచ్చాం.’ అని ప్రకటించారు. గత ప్రభుత్వం ఆరోగ్య రంగాన్ని నిర్లక్ష్యం చేసిందన్నారు. మన పాలన-మీ సూచన కార్యక్రమంలో భాగంగా శుక్రవారం వైద్య ఆరోగ్య శాఖ, ఆసుపత్రుల్లో​ నాడు- నేడుపై తాడేపల్లిలోని క్యాంపు ఆఫీస్‌లో సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్ష నిర్వహించారు. రాబోయే రోజుల్లో కరోనా ఇంకా చాలా మందికి రావొచ్చని..వచ్చినా ఏమీకాదన్నారు.

ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ‘‘ ఆరోగ్యశ్రీ పరిధిని రూ.5 లక్షలలోపు ఆదాయం ఉన్నవారికి వర్తింపజేశాం. 1.42 కోట్ల మందిని ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చాం. 2 వేల జబ్బులను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెస్తూ.. జులై 8 నుంచి మరో 6 జిల్లాలో అమలు చేస్తాం. నవంబర్‌ 8 నుంచి మిగిలిన జిల్లాల్లో కూడా అమలు చేస్తాం. క్యాన్సర్‌ రోగాన్ని కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చాం. స్పీచ్‌ థెరపీని కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చాం. సూపర్‌ స్పెషాలిటీ వైద్య సేవల కోసం.. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాల్లో కూడా ఆరోగ్యశ్రీని అమలు చేస్తున్నాం. నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు గత ప్రభుత్వం పెట్టిన ఆరోగ్యశ్రీ బకాయిలను కూడా చెల్లించా’’మని పేర్కొన్నారు. ఆస్పత్రుల రూపురేఖలు మార్చేలా "నాడు-నేడు" చేపట్టాం. కార్పొరేట్‌ ఆస్పత్రులకు ధీటుగా ప్రభుత్వాస్పత్రులను ఆధునీకరిస్తున్నాం. కొత్తగా మరో 16 టీచింగ్ ఆస్పత్రులతోపాటు... ఐటీడీఏ పరిధిలో 7 సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులను ఏర్పాటు చేస్తున్నాం. గ్రామాల్లో విలేజ్‌ క్లినిక్‌లను ఏర్పాటు చేయబోతున్నాం. 24 గంటలు వైద్యసహాయం అందుబాటులో ఉండేలా విలేజ్‌ క్లినిక్‌లు. రూ.2,600 కోట్లతో విలేజ్‌, వార్డు క్లినిక్‌లు. రూ.671 కోట్లతో పీహెచ్‌సీలను కూడా ఆధునీకరిస్తున్నామని తెలిపారు.

Next Story
Share it