Telugu Gateway
Andhra Pradesh

కరోనా పరీక్షలు ఏపీలో 3.63 లక్షలు..తెలంగాణలో 30 వేలు

కరోనా పరీక్షలు ఏపీలో 3.63 లక్షలు..తెలంగాణలో 30 వేలు
X

ఏపీలో తొంభై రోజుల్లో సగటున రోజుకు 4037 పరీక్షలు

అదే తెలంగాణలో 90 రోజుల్లో సగటున రోజుకు 333 పరీక్షలు

ఏపీకి హైదరాబాద్ లో ఉన్న తరహాలో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం లేదు. అంతేకాదు..హైదరాబాద్ స్థాయి నగరం లేదు. కానీ అక్కడ వచ్చిన మొత్తం కరోనా కేసులు శనివారం నాటికి 3461. అంతర్జాతీయ విమానాశ్రయం..హైదరాబాద్ వంటి ప్రధాన నగరం ఉన్న తెలంగాణలో కేసుల సంఖ్య 2499. ఏపీలో కేసుల సంఖ్య ఎక్కువగా ఉండటానికి..తెలంగాణలో కేసుల సంఖ్య ఇంత తక్కువగా ఉండటానికి ప్రధాన కారణం కరోనా పరీక్షల నిర్వహణలో తేడా మాత్రమే. రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు నమోదు ప్రారంభం అయింది మార్చి నెలలోనే. కానీ ఏపీలో ఇఫ్పటివరకూ 3,63,378 మందికి పరీక్షలు నిర్వహించగా..తెలంగాణలో కేవలం 30 వేల కరోనా పరీక్షలు మాత్రమే నిర్వహించారు. ఈ విషయాన్ని తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరక్టర్ జి. శ్రీనివాసరావు తెలిపారు. కరోనా కేసులు వెలుగు చూసిన తొలి రోజుల్లో ఏపీలో కూడా కరోనా పరీక్షల నిర్వహణ తక్కువ స్థాయిలోనే ఉన్నా కూడా క్రమక్రమంగా ఏపీ సర్కారు సంఖ్యను పెంచుకుంటూ పోయింది. దీంతో గత తొంభై రోజుల సగటుగా తీసుకుంటే ఏపీలో రోజుకు కరోనా పరీక్షలు 4037 గా ఉంటే..అదే తెలంగాణలో తొంభై రోజులకు సగటు కరోనా పరీక్షలు కేవలం 333 మాత్రమే.

ఈ లెక్కన తెలంగాణలో కరోనా పరీక్షల తీరు ఏ విధంగా ఉందో ఊహించుకోవచ్చు. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కూడా తెలంగాణలో పరీక్షల తీరుపై ఆక్షేపణ వ్యక్తం చేసింది. వైరస్ ను చేధించేందుకు పరీక్షల సంఖ్యను పెంచాలని ఆదేశించింది. తెలంగాణలో అతి తక్కువ పరీక్షలు చేయటంపై హైకోర్టు కూడా విచారణ సందర్భంగా అసంతృప్తి వ్యక్తం చేసింది. తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్న తొలి రోజుల్లో ముఖ్యమంత్రి కెసీఆర్ చెప్పిన మాటలు ప్రజలకు ధీమా ఇఛ్చాయి. కానీ తర్వాత పరీక్షల జరుగుతున్న తీరు చూసిన తర్వాత మాత్రం ప్రజల్లో భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తాము ఐసీఎంఆర్ మార్గదర్శకాల ప్రకారమే పరీక్షలు చేస్తున్నామని పదే పదే చెబుతున్నారు. ఐసీఎంఆర్ మార్గదర్శకాలు దేశమంతటికీ ఓకేలా ఉంటాయి కానీ..తెలంగాణకు మాత్రమే విడిగా ఉండవు కదా?. తెలంగాణలో కేవలం 30 వేల పరీక్షలు మాత్రమే చేయగా..ఇతర రాష్ట్రాలు లక్షల సంఖ్యలో పరీక్షలు చేసి ఎందుకు కేసులను గుర్తిస్తున్నట్లు?. మరి ఇతర రాష్ట్రాలు ఏ ప్రమాణాల ప్రకారం పరీక్షలు నిర్వహిస్తున్నాయి..తెలంగాణ ఇంత తక్కువ పరీక్షలు నిర్వహించటానికి కారణం ఏంటి అన్నది పెద్ద మిస్టరీగా మారింది. పెద్ద ఎత్తున పరీక్షలు నిర్వహించి రోగులను గుర్తించటం ద్వారా వైరస్ వ్యాప్తిని అరికట్టడం సులభం అవుతుంది. అలా కాకుండా అతి తక్కువ పరీక్షలు నిర్వహిస్తే ఒక్కసారిగా వైరస్ విస్తృతం అయ్యే ప్రమాదం కూడా ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

ఏపీలో ఏప్రిల్, మే నెలల్లో అయితే ఒక్కో రోజు ఏడు వేలు..ఎనిమిది వేలు..తొమ్మిది వేల లెక్కన కూడా పరీక్షలు నిర్వహించి వైరస్ బాధితులను గుర్తించారు. కానీ తెలంగాణలో ఏ ఒక్క రోజు కూడా ఇంత పెద్ద ఎత్తున పరీక్షలు నిర్వహించిన దాఖలాలు లేవని చెబుతున్నారు. అటు సీఎం కెసీఆర్. ఇటు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ లు తెలంగాణలో కరోనా కేసులు త్వరలోనే ముగిసిపోతాయని పలుమార్లు ప్రకటించారు. తాజాగా మంత్రి ఈటెల అయితే..కరోనా నియంత్రణ ప్రభుత్వం వల్ల కాదు అని తేల్చేశారు. మిగిలిన రాష్ట్రాల తరహాలో హైదరాబాద్ తోపాటు కేసులు వెల్లడైన జిల్లాల్లో విస్తృతంగా పరీక్షలు నిర్వహించి ఉంటే కొంత ప్రయోజనకరంగా ఉండేదని..అలా చేయకపోవటం వల్ల ఈ ప్రమాదం నుంచి ఎప్పుడు బయటపడతామో తెలియకుండా నిత్యం బిక్కుబిక్కుమంటూ గడపాల్సి వస్తోందనే అభిప్రాయాన్ని అధికారులు వ్యక్తం చేస్తున్నారు. అయితే తెలంగాణ సర్కారు మాత్రం మొదటి నుంచి ఎందుకో ఎక్కువ టెస్ట్ ల విషయంలో అనాసక్తంగా ఉంది. మరి రాబోయే రోజుల్లో ఈ పరిణామాలు ఎటువైపు దారితీస్తాయో వేచిచూడాల్సిందే.

Next Story
Share it