Telugu Gateway
Andhra Pradesh

మేం అమ్మదలచుకుంటే ఈ కోటిన్నర భూములే అమ్మాలా?

మేం అమ్మదలచుకుంటే ఈ కోటిన్నర భూములే అమ్మాలా?
X

టీటీడీ చైర్మన్ వై వీ సుబ్బారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో టీటీడీకి చెందిన ఆస్తుల అమ్మకం విషయం విషయంలో తలెత్తిన వివాదంపై స్పందిస్తూ విచిత్ర వ్యాఖ్యలు చేశారు. ‘మేం అమ్మదలచుకుంటే 1.53 కోట్ల విలువైన భూములే అమ్మాలా?. ఎక్కడో తమిళనాడులో మారుమూల ప్రాంతంలో ఉన్న వాటినే అమ్మాలా?. కుంభకోణం చేయాలంటే ఇవే చేయాలా? భూములు కొట్టేయాలనే..కైంకర్యం చేయాలనుకుంటే..చంద్రబాబులా సదావర్తి భూములు..అమ్మవారి భూములు. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అలాంటి కార్యక్రమాలు చేసే ఆలోచన లేదు. ప్రతిపక్షంలో ఉండగా కూడా కాపాడే ప్రయత్నం చేసింది మేమే.. టీటీడీ నిధులు కూడా ఒక్కపైసా కూడా దుర్వినియోగం కాకుండా బోర్డు బాధ్యతలు చేపట్టాక చర్యలు తీసుకుంటున్నాం. గత ప్రభుత్వంలో గరుడ వారధి పేరుతో బ్రిడ్జి నిర్మించేందుకు కూడా నిధులు శాంక్షన్ చేశారు.

రాజకీయ వ్యతిరేకతతోనే మాపై నిందలు. టీటీడీలో నిరుపయోగంగా ఉన్న ఆస్తులు అమ్మకం కొత్తేమీ కాదు. చంద్రబాబు హయాంలో కూడా పలు ఆస్తులు అమ్మారు. మేం ప్రారంభించినట్లు నిందలు వేసే కార్యక్రమం చేస్తున్నారు. మేం దేవుడి సేవకులం. 2016 జనవరి 30న ఛైర్మన్ గా చదలవాడ కృష్ణమూర్తి ఉన్నప్పుడు 50 నిరర్ధక ఆస్తులు బహిరంగ వేలంగా విక్రయించటానికి తీర్మానం చేసింది బోర్డు. మేం ఏ నిర్ణయం తీసుకోలేదు ఇంకా. పాత బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని మా బోర్డు ఓ సారి సమీక్ష చేశాం. రోడ్డు మ్యాప్ తయారు చేయాలని చర్చించాం. ఆస్తులను ఎలా కాపాడాలి. అమ్మటం కాకుండా వీటిని కాపాడుకునేందుకు ఎలా చేయాలనే దానిపై చర్చ చేస్తాం. ధార్మిక పెద్దలు సలహాలు ఇవ్వమని కోరతాం. అన్యాక్రాంతం కాకూడదనే మా కోరిక. ’ అని సుబ్బారెడ్డి మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు.

Next Story
Share it