Telugu Gateway
Telangana

అంతరాష్ట్ర ప్రయాణాలకు తెలంగాణ గ్రీన్ సిగ్నల్

అంతరాష్ట్ర ప్రయాణాలకు తెలంగాణ గ్రీన్ సిగ్నల్
X

తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ తాజా ఆదేశాల మేరకు అంతరాష్ట్ర ప్రయాణాలకు అనుమతిస్తూ ఆదివారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో హైదరాబాద్ లో ఉంటున్న ఏపీ ప్రజలతోపాటు పలు రాష్ట్రాల ప్రజలు ఎలాంటి ప్రత్యేక అనుమతులు అవసరం లేకుండానే వారి వారి ప్రాంతాలకు వెళ్లొచ్చు. లాక్ డౌన్ లో గత కొన్ని నెలలుగా చిక్కుకపోయిన వారికి ఇది పెద్ద ఊరట కలిగించే అంశం. అయితే అంతరాష్ట్ర రవాణా విషయంలో బస్సు సర్వీసులు ప్రారంభిస్తారా? లేదా అన్న విషయం మాత్రం తేలాల్సి ఉంది. జూన్ 1 నుంచి పలు మార్గాల్లో రైల్వే సర్వీసులు ప్రారంభం కానున్నాయి. కాకపోతే ముందస్తుగా రిజర్వ్ అయిన టిక్కెట్ ఉంటే తప్ప..అందులో ప్రయాణికులను అనుమతించరు. తెలంగాణ సర్కారు తాజా ఆదేశాలతో సొంత కార్లు ఉన్నవారు..క్యాబ్ సర్వీసులను బుక్ చేసుకుని ఎవరికి వారు తమ రాష్ట్రాలకు వెళ్ళొచ్చు.

అయితే వెళ్ళే రాష్ట్రాల నిర్ణయాలను కూడా ప్రజలు గమనంలోకి తీసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలోని కంటైన్ మెంట్ జోన్లలో కూడా లాక్ డౌన్ ను జూన్ 30 వరకూ పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. రాత్రి వేళ కర్ఫ్యూ సమయం కూడా రాత్రి తొమ్మిది గంటల నుంచి ఉదయం ‘ఐదు గంటల వరకే అమలు కానుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. జూన్ 8 నుంచి రాష్ట్రంలో కూడా మాల్స్, రెస్టారెంట్లు, హోటళ్ళు, దేవాలయాలు అన్నీ ప్రారంభం కానున్నాయి. అయితే దీనికి సంబంధించి విడిగా ఆదేశాలు ఇఛ్చే అవకాశం ఉంది.

Next Story
Share it