Telugu Gateway
Telangana

రైతులకు మంచి ధర కోసమే ఈ ప్రయత్నం

రైతులకు మంచి ధర కోసమే ఈ ప్రయత్నం
X

రాష్ట్రంలో ప్రతిపాదించిన నియంత్రిత పద్ధతిలో పంటల సాగు నిర్ణయాన్ని అత్యధిక మంది రైతులు స్వాగతిస్తున్నట్లు సర్వేలో తేలిందని ముఖ్యమంత్రి కెసీఆర్ తెలిపారు. ఇది మంచి పరిణామం అని, రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ‘నియంత్రిత పద్ధతిలో సాగు చేయడం వల్ల రైతులకు మేలు కలుగుతుంది. ప్రభుత్వానికి కావాల్సింది ఇదే. ఎన్నో వేల కోట్లు ఖర్చు పెట్టి, ఎంతో శ్రమకోర్చి ప్రాజెక్టులు నిర్మించాం. దానివల్ల పంటలు బాగా పండుతాయి. పండిన పంటకు మంచి ధర వచ్చినప్పుడే రైతులకు లాభం. ఆ ధర రావడం కోసమే తన ప్రయత్నం అంతా అని కెసీఆర్ వ్యాఖ్యానించారు. విభిన్న నేలలు, సమశీతోష్ణ వాతావరణం, మంచి వర్షపాతం, వృత్తి నైపుణ్యం కలిగిన రైతులు, రైతు పక్షపాత ప్రభుత్వం లాంటి అనుకూలతలను సద్వినియోగం చేసుకుని తెలంగాణ రైతులు ప్రపంచంతో పోటీ పడే గొప్ప రైతాంగంగా మారాలని ఆకాంక్షించారు. నియంత్రిత పద్ధతిలో పంటలు సాగు చేసే విధానంపై చర్చించేందుకు గురువారం ప్రగతి భవన్ లో విస్తృత స్థాయి సమావేశం జరిగింది. మంత్రులు, సీనియర్ అధికారులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, కలెక్టర్లు, జిల్లా వ్యవసాయాధికారులు, జిల్లా రైతు బంధు సమితుల అధ్యక్షులు, వ్యవసాయ యూనివర్సిటీ అధికారులు, శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.

‘‘రైతులంతా ఒకే పంట వేయడం ద్వారా డిమాండ్ పడిపోయి నష్టపోతున్నారు. ఈ పరిస్థితిని నివారించడానికే ప్రభుత్వం ఎన్నో విధాలుగా ఆలోచించి, నియంత్రిత పద్ధతిలో పంటలు సాగు చేయాలని రైతులకు సూచిస్తున్నది. ఏ సీజన్ లో ఏ పంట వేయాలి? ఎక్కడ ఏ పంట సాగు చేయాలి? ఏ రకం సాగు చేయాలి? అనే విషయాలను వ్యవసాయ శాస్త్రవేత్తలు నిర్ణయించారు. ఏ పంటకు మార్కెట్లో డిమాండ్ ఉందో ఆగ్రో బిజినెస్ విభాగం వారు తేల్చారు. దాని ప్రకారం ప్రభుత్వం రైతులకు తగు సూచనలు చేస్తున్నది. ప్రభుత్వం చెప్పిన మాట ప్రకారం పంటలు వేయడం వల్ల రైతులు నష్టపోయే అవకాశం ఉండదు’’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తన వ్యవసాయ క్లస్టర్ అయిన ఎర్రవెల్లిలో తన సొంత ఖర్చుతో రైతు వేదిక నిర్మిస్తానని ప్రకటించారు. దీన్ని స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్రంలోని మంత్రులంతా తలా ఒక రైతు వేదికను తమ స్వంత ఖర్చుతో నిర్మించడానికి ముందుకొచ్చారు. రైతుబంధు అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ చైర్మన్ మారెడ్డి శ్రీనివాసరెడ్డి, కొందరు జిల్లాల రైతు బంధు అధ్యక్షులు కొందరు కూడా తమ స్వంత ఖర్చుతో రైతు వేదికలు నిర్మించడానికి ముందుకొచ్చారు.

రాష్ట్రంలోని 2602 క్లస్టర్లలో నాలుగైదు నెలల్లో రైతు వేదికల నిర్మాణం పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అన్ని రైతు వేదికల్లో ఎఇవోకు కార్యాలయం, కంప్యూటర్, వీడియో కాన్ఫరెన్సులు నిర్వహించుకోవడానికి వీలుగా టీవి తదితర ఏర్పాట్లు ఉండాలని సిఎం చెప్పారు. రైతు వేదికల నిర్మాణానికి స్థలం లేదా నగదు విరాళంగా ఇచ్చిన వారు సూచించిన పేర్లు పెట్టాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఈ వర్షాకాలం నుంచే రాష్ట్రంలో ఏ గుంటలో ఏ పంట వేస్తున్నారనే లెక్కలు తీయాలి. వ్యవసాయ విస్తరణాధికారులు ఖచ్చితమైన వివరాలు సేకరించాలి. పూర్తి స్థాయిలో క్రాప్ ఎన్యూమరేషన్ జరగాలి. రాష్ట్రంలో అమలు చేసే నియంత్రిత పద్ధతిలో పంట సాగు విధానంపై అవగాహన కల్పించేందుకు రానున్న నాలుగైదు రోజుల్లోనే క్లస్టర్ల వారీగా రైతుy సదస్సులు నిర్వహించాలి. ప్రభుత్వ ఉద్దేశాన్ని, నియంత్రిత పద్ధతిలో సాగు చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించాలి.

మంత్రులు, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్లు, డిసిసిబి చైర్మన్లు, డిసిఎంఎస్ చైర్మన్లు, ఎంపిపిలు, జడ్పీటిసిలు, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్లు, సింగిల్ విండో చైర్ పర్సన్లు, ఎంపిటిసిలు, సర్పంచులను ఈ సదస్సులకు ఆహ్వానించాలి. వర్షాకాలంలో మక్కల సాగు ఏమాత్రం మంచిది కాదు. వర్షాకాలంలో మక్కల దిగుబడి 25 క్వింటాళ్లు మాత్రమే వస్తుంది. అదే యాసంగిలో పండిస్తే 35 క్వింటాళ్ల వరకు వస్తుంది. వర్షాకాలంలో మక్కల సాగు వల్ల కేవలం 25వేల ఆదాయం మాత్రమే వస్తుంది. పత్తి పండిస్తే 50వేల ఆదాయం వస్తుంది. తెలంగాణలో 25 లక్షల టన్నుల మక్కలే కావాల్సి ఉంది. అది యాసంగి పంటతో సమకూరుతుంది.

Next Story
Share it