Telugu Gateway
Cinema

జూన్ నుంచి షూటింగ్ లు..తర్వాతే థియేటర్లు

జూన్ నుంచి షూటింగ్ లు..తర్వాతే థియేటర్లు
X

టాలీవుడ్ కు చెందిన ప్రముఖులు శుక్రవారం నాడు తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ తో భేటీ అయ్యారు. షూటింగ్ లకు అనుమతులు, థియేటర్ల ప్రారంభోత్సవం వంటి అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా సీఎం కెసీఆర్ మాట్లాడుతూ సినిమా పరిశ్రమపై లక్షలాది ఆధారపడి పనిచేస్తున్నందున పోస్ట్ ప్రొడక్షన్, షూటింగ్ నిర్వహణ, థియేటర్లలో ప్రదర్శనలను దశల వారీగా పునరుద్ధరించాల్సిన అవసరం ఉందన్నారు. తక్కువ మందితో ఇండోర్ లో చేసే వీలున్న పోస్ట్ ప్రొడక్షన్ పనులను మొదట ప్రారంభించుకోవాలని సీఎం కెసీఆర్ సినీ ప్రముఖులకు సూచించారు. తర్వాత దశలో అంటే జూన్ నెలలో సినిమా షూటింగ్ లు ప్రారంభించుకోవాలన్నారు. పరిస్థితిని బట్టి సినిమా థియేటర్ల ప్రారంభంపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. సినీ పరిశ్రమ బతకాలని..అదే సమయంలో కరోనా వ్యాప్తి కూడా జరగవద్దని అన్నారు.

దీని కోసం సినిమా షూటింగ్ లను వీలైనంత తక్కువ మందితో లాక్ డౌన్ నిబంధనలు పాటిస్తూ, కరోనా వ్యాప్తి నివారణకు అనుసరిస్తున్న మార్గదర్శకాల ప్రకారం నిర్వహించుకోవాలని సూచించారు. ఎంత మందితో షూటింగ్ లు నిర్వహించుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశంపై సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సమావేశం అయి చర్చించాలని సినీ ప్రముఖులను కోరారు. ఆ వెంటనే ఖచ్చితమైన మార్గదర్శకాలతో షూటింగ్ లకు అనుమతి ఇస్తామని తెలిపారు. కెసీఆర్ తో సమావేశం అయిన వారిలో టాలీవుడ్ కు చెందిన ప్రముఖులు చిరంజీవి, నాగార్జున, డి. సురేష్ బాబు, అల్లు అరవింద్, ఎన్. శంకర్, రాజమౌళి, దిల్ రాజు, త్రివిక్రమ్ శ్రీనివాస్, సీ. కళ్యాణ్, కొరటాల శివ, దాము, మెహర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Next Story
Share it