Top
Telugu Gateway

తెలుగు తారాలోకం ‘దిగి’రాక తప్పదా?!

తెలుగు తారాలోకం ‘దిగి’రాక తప్పదా?!
X

హీరో..హీరోయిన్ల రెమ్యునరేషన్లలో భారీ కోత తప్పదా!

టాలీవుడ్ లో సమూల మార్పులు రాబోతున్నాయి. మారిన పరిస్థితుల్లో హీరోలు మొదలుకుని అందరూ మారక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయి. తెలుగు తారాలోకం ‘దిగి’ రాక తప్పదని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. హీరోలు మొదలుకుని..డైరక్టర్లు, హీరోయిన్లు అందరూ ఇప్పుడు తమ పారితోషికాలకు భారీగా కోత పెట్టాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఈ సంక్షోభ సమయంలో ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపై నిర్మాతలు ఇఫ్పటికే చర్చలు కూడా ప్రారంభించారు. టాలీవుడ్ లో టాప్ డైరక్టర్లే రెమ్యునరేషన్ కింద 25 నుంచి 30 కోట్ల రూపాయల వరకూ తీసుకుంటున్నారు. ఇక హీరోల పరిస్థితి అయితే చెప్పనక్కర్లేదు. టాప్ హీరోల రెమ్యునరేషన్ 30 కోట్ల రూపాయల పైమాటే. కొంత మంది హీరోలు అయితే కొంత రెమ్యునరేషన్ తోపాటు ఏకంగా సినిమా లాభాల్లో వాటాలు కూడా తీసుకుంటున్నారు. పలు రూపాల్లో పెరిగిన మార్కెట్, అందివచ్చిన పలు అవకాశాలను వాడుకుంటూ హీరోలు...దర్శకులు భారీగా రెమ్యునరేషన్స్ పెంచారు. ఇంత కాలం నడిచిపోయింది. కానీ ఇఫ్పుడు కంటికి కన్పించని ఈ వైరస్ హీరోలను ఇంటికి పరిమితం చేసింది. అంతే కాదు రాబోయే రోజుల్లో దర్శకుల దగ్గర నుంచి హీరోలు, హీరోయిన్ల వరకూ అందరూ తమ రెమ్యునరేషన్స్ లో కోత పెట్టుకోవటం తప్పదని చెబుతున్నారు.

మళయాళ సినీ పరిశ్రమలో ఇప్పటికే ఈ దిశగా చర్యలు ప్రారంభించారు. నిర్మాతలు అందరూ సమావేశం అయి హీరో, హీరోయిన్లతోపాటు ఇతర నటులు కూడా తమ రెమ్యునరేషన్లను తగ్గించుకోవాలని కోరారు. కరోనా సంక్షోభ సమయంలో రెమ్యునరేషన్లు తగ్గించుకోకపోతే పరిశ్రమ మనుగడ సాగించటం కష్టం అని నిర్మాతలు తేల్చిచెప్పారు. కరోనా దెబ్బకు దేశమంతా సినీ పరిశ్రమ విలవిలాడుతోంది. అందుకు టాలీవుడ్ కూడా మినహాయింపు ఏమీ కాదు. కరోనా సమస్య ఇంకా దేశాన్ని వీడలేదు. అది ఎప్పుడు వీడుతుందో కూడా తెలియదు. ఒక వేళ కరోనా తగ్గుముఖం పట్టినా ఇప్పటికిప్పుడు థియేటర్లు తెరిచి..కొత్త సినిమాలు విడుదలయ్యే పరిస్థితి లేదు. థియేటర్లు తెరిచినా కూడా ప్రేక్షకులు కరోనా భయాన్ని వీడి థియేటర్లలో వస్తారా? అన్న అనుమానం పరిశ్రమ వర్గాలను పీడిస్తోంది. ఈ పరిణామాలు అన్నింటిని గమనంలోకి తీసుకుని నిర్మాతలు ఓ కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నారని..దీని ప్రకారం నిర్మాణ వ్యయం భారీగా తగ్గించుకోగలిగితే తప్ప మనుగడ ఉండదని భావిస్తున్నారు.పరిశ్రమ కరోనా నుంచి కోలుకుని సాదారణ స్థిితికి చేరటానికి కనీసం అంటే ఏడాది సమయం పడుతుందని ఓ ప్రముఖ నిర్మాత తెలిపారు. ఇప్పటికే టాలీవుడ్ లో సుమారు 600 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో తలపెట్టిన ప్రాజెక్టులు ఎక్కడివి అక్కడే ఆగిపోయాయి.

Next Story
Share it