Telugu Gateway
Politics

తెలంగాణలో మే 29 వరకూ లాక్ డౌన్ పొడిగింపు

తెలంగాణలో మే 29 వరకూ లాక్ డౌన్ పొడిగింపు
X

కొత్తగా 11 పాజిటివ్ కేసులు...కరోనాతో కలసి బతకాల్సిందే

మద్యం షాపులు ఓపెన్, 16 శాతం ధరల పెంపు

మేలోనే పదవ తరగతి పరీక్షలు..త్వరలో తేదీలు వెల్లడిస్తాం.

తెలంగాణలో లాక్ డౌన్ కు సంబంధించి ముఖ్యమంత్రి కెసీఆర్ కీలక ప్రకటన చేశారు. ఊహించినట్లుగా రాష్ట్రంలో లాక్ డౌన్ ను మే 29 వరకూ అమలు చేస్తామని స్పష్టం చేశారు. కొంత మంది తిట్టుకున్నా కూడా ..ఎక్కువ మంది లాక్ డౌన్ కే మొగ్గుచూపారని తెలిపారు. మంత్రివర్గ సమావేశంలోనూ ఇదే అభిప్రాయం వ్యక్తం అయిందని తెలిపారు. మంగళవారం నాడు కెసీఆర్ అధ్యక్షతన జరిగిన సుదీర్ఘ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రమంతటా కూడా రాత్రి పూట కర్ఫూ ఉంటుందని తెలిపారు. రాత్రి ఏడు గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకూ కర్ఫ్యూ విధిగా అమలు చేస్తామన్నారు. ఆర్ధిక కార్యకలాపాలకు సంబంధించిన కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం ముందుకెళతామన్నారు. హైదరాబాద్ లో గృహ నిర్మాణానికి అనుమతి ఇచ్చినందున సిమెంట్, స్టీల్ తోపాటు ఇతర గృహ అవసరాలకు చెందిన షాప్ లు ఓపెన్ చేస్తారని తెలిపారు. రాష్ట్రంలోహైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లోనే ఎక్కువ కరోనా కేసులు ఉన్నాయని తెలిపారు.

జనసాంద్రత ఎక్కువ ఉన్న జిల్లాలు కూడా ఇవే అన్నారు. మొత్తం కేసుల్లో 726 కేసులు ఈ జిల్లాల్లోనే ఉన్నాయి. కొత్తగా వస్తున్నవి అన్నీ జీహెచ్ఎంసీ పరిధిలోనే ఉన్నాయి. ఇక్కడ ఉన్న ప్రజలు పూర్తి సహకారం అందించాలి. ఇక్కడే కమ్యూనిటీ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. హైదరాబాద్ చల్లగా ఉండాలి. ముంబయ్ దుస్థితి మనకు రావొద్దు. చైనా కంపెనీల దృష్టి దక్షిణ భారత దేశంవైపు ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం 1096 మందికి పాజిటివ్ కేసులున్నాయి. 628 మంది డిశ్చార్జ్. 43 మంది ఈ రోజు డిశ్చార్జ్ అయ్యారు. కొత్తగా 11 మందికి పాజిటివ్ వచ్చింది. ట్రీట్ మెంట్ లో 439 మంది ఉన్నారు. మొదటి నుంచి పకడ్భందీగా..కఠినంగా వ్యవహరించారు.

దేశంలోనే మొదటి కంటైన్ మెంట్ జోన్ కరీంనగర్. అప్పటి వరకూ దేశంలో ఎవరికీ కంటైన్ మెంట్ అన్నది కూడా తెలియదు. వంద శాతం సక్సెస్ అయ్యాం. టఫ్ గా ఎలా ఉండాలి అన్నది కరీంనగర్ నుంచి నేర్చుకున్నాం. దేశ సగటు విషయంలో చూస్తే కూడా తెలంగాణలో మరణాలు రేటు తక్కువగా ఉంది. రివకరి రేటు దేశ సగటు 27.40 శాతం, 57.3 శాతం తెలంగాణలో. ఏ రకంగా చూసుకున్నా తెలంగాణలో మెరుగ్గా ఉంది. కరోనా నియంత్రణ విషయంలో కృషి చేసిన వైద్య సిబ్బంది, పోలీసులు, ఇతర అధికారులు అందరినీ అభినందిస్తున్నా. జినోమ్ వ్యాలీలో స్టార్ట్ చేసిన తొలి దశ కంపెనీల్లో ఒకటైన భారత్ బయోటెక్, శాంతా బయోటెక్ వరప్రసాద్ రెడ్డి కలిశారు.

సీరియస్ గా పరిశోధనలు జరుగుతున్నాయి. ఆగస్టు లేదా సెప్టెంబర్ కు వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉంది. అది కూడా తన తెలంగాణ నుంచి వస్తే చాలా గ్రేట్. ప్రజలు తమంతట తాము స్వీయ నియంత్రణ పాటించాలి. ఇది ఎవరి కోసమే కాదు..మన కోసం ఇది. భౌతిక దూరం పాటిస్తూ విజయం సాధించాం. కొంచెం ముందుకు పోతే విజయం వచ్చే ఆస్కారం ఉంటుంది. అందరూ దయచేసి సహకరించాలి. ఇప్పటికే సమస్యలు ఎదుర్కొంటున్న వారు బయటకు రావొద్దు. వారికి కోటి మాస్క్ లు ప్రభుత్వమే సప్లయ్ చేస్తుంది. ఉచితంగా. మూడు నెలలకు ఒకేసారి మందులు ఇవ్వాలని సూచించాం. మే 15న మరోసారి సమీక్ష జరిపి భవిష్యత్ పై నిర్ణయం తీసుకుంటాం. అప్పటికి దేశంలోని అనుభవాలు కూడా గమనంలోకి వస్తాయన్నారు. గ్రీన్ జోన్లలో మండల, గ్రామ స్థాయిలో అన్ని షాపులు తెరుచుకోవచ్చు. మున్సిపల్ టౌన్స్ లో 50 శాతం షాపులు మాత్రమే తీస్తారు. ఇసుక మైనింగ్ కూడా బుధవారం నుంచి ప్రారంభం అవుతుంది. ఆర్ టీఏ ఆఫీసులు కూడా యధావిధిగా పనిచేస్తాయి. పదవ తరగతి పరీక్షలు మధ్యలో ఆగిపోయాయి. హైకోర్టు ఏ నిబంధనలు చెపితే ఆ నిబంధనల ప్రకారం పరీక్షలు నిర్వహిస్తాం. పిల్లలు టెన్షన్ లో ఉన్నారు. తల్లిదండ్రులు కూడా. ప్రత్యేక బస్ లు ఏర్పాటు చేస్తాం. నిబంధనలు పాటిస్తూ మే నెలలోనే పూర్తి చేస్తాం. ఇంటర్ వాల్యుయేసన్ కూడా వెంటనే ప్రారంభించమని కోరాం. కరోనా మనం కలసి బతకాల్సిందే. ఇది రేపో..ఎల్లుండో పోయే సమస్య కాదు. ఉపాయంతో బతకాలి. ఇది మనల్ని భయపెడుతూనే ఉంటుంది. తెలంగాణలో న్యాయవాదులను ఆదుకునేందుకు 25 కోట్లతో ఓ ట్రస్ట్ ఏర్పాటు చేశామన్నారు.తెలంగాణలో కూడా మద్యం షాపులు ఓపెన్ చేస్తున్నామని తెలిపారు. ధరలు 16 శాతం పెంచుతున్నామని..మిగిలిన రాష్ట్రాల తరహాలో భారీగా పెంచబోమని అన్నారు. కంటోన్మైంట్ జోన్లలో తప్ప అన్ని చోట్లా మద్యం షాపులు ఓపెన్ చేస్తామని తెలిపారు.

Next Story
Share it