22 ట్వీట్లు...ఐదు ప్రెస్ మీట్లు...టీడీపీ రికార్డులు

‘నలభై మంది గ్యాంగ్ స్టర్స్ ను ఎన్ కౌంటర్ చేశాను. అదే అండర్ కవర్ ఆపరేషన్ అయితే అన్ లిమిటెడ్. ఇదంతా స్పాన్ ఆఫ్ ఫైవ్ ఇయర్స్. దిస్ ఈజ్ నాట్ జస్ట్ మై ట్రాక్ రికార్డ్. దిస్ ఈజ్ ఆల్ టైమ్ రికార్డు.’ దూకుడు సినిమాలో మహేష్ బాబు చెప్పిన డైలాగ్ ఇది. బహుశా తెలుగుదేశం పార్టీ కూడా ప్రెస్ మీట్లు..ప్రెస్ నోట్లు..ట్వీట్ల ద్వారా దేశంలోనే ఏ రాజకీయ పార్టీ చేయని రీతిలో మీడియాపై ‘దాడి’ చేస్తోంది. ప్రపంచం అంతా ఇప్పుడు కరోనాకు భయపడుతుంటే... వాళ్ళు మాత్రం కరోనా కంటే ‘తెలుగుదేశం’ నాయకుల ప్రెస్ మీట్లకు..ఆ పార్టీ నాయకులు చేసే ట్వీట్లకు వణికిపోతున్నారు. ఎందుకంటే ఆ పార్టీ బీట్ చూసే రిపోర్టర్ల ఫోన్లకు అసలు విసుగు, విరామమే ఉండటం లేదు. పార్టీ అధినేత చంద్రబాబునాయుడి దగ్గర నుంచి మొదలుకుని ఆయన తనయుడు, పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, పార్టీ నేతలు చేసే ట్వీట్లు..ప్రెస్ నోట్లు..ప్రెస్ మీట్లతో అమరావతిలో తెలుగుదేశం పార్టీ వ్యవహారాలు చూసే బీట్ రిపోర్టర్లు గజగజ వణికిపోతున్నారు.
మంగళవారం మధ్యాహ్నానికే టీడీపీ నేతల నుంచి 22 ట్వీట్లు వచ్చాయి. 5 ప్రెస్ మీట్లు పూర్తయ్యాయి. ప్రెస్ నోట్లు అదనం. సాయంత్రానికి ఈ సంఖ్య మరింత పెరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సహజంగా అధికార పార్టీలో హడావుడి ఎక్కువగా ఉంటుంది. కానీ అదేంటో విచిత్రంగా అధికార పార్టీ కంటే ప్రతిపక్షంలో మాత్రం ఎక్కడలేని హడావుడి కన్పిస్తోంది. నిజంగా ఆ పార్టీ నేతలు చేసే ట్వీట్లు అన్నీ కవర్ కావాలంటే మీడియా ఛానళ్ళు అన్నీ పూర్తిగా తెలుగుదేశం పార్టీకే కేటాయించాల్సి ఉంటుంది. ఆ పార్టీ నాయకుల ప్రెస్ మీట్లు..ప్రకటనలు కవర్ చేయాలంటే పత్రికల్లో పేజీలకు పేజీల వీళ్లకే కేటాయించాల్సి ఉంటుంది. మహేష్ బాబు సినిమా డైలాగ్ లాగా టీడీపీ పార్టీ నుంచి ట్వీట్లు..ప్రెస్ నోట్లు..ప్రెస్ మీట్లు ‘ఆల్ టైమ్ రికార్డు’లను బద్దలు కొడుతున్నాయి.
ప్రభుత్వం చేసే పొరపాట్లను ప్రతిపక్ష పార్టీ గా టీడీపీ ఎత్తిచూపటాన్ని, ప్రశ్నించటాన్ని ఎవరూ ఆక్షేపించరు. కానీ కేవలం ఏదో చేశామంటే చేశాం అన్నట్లు సంఖ్యలు...రికార్డుల కోసం పాకులాడితే ‘క్వాలిటీ’ పోతుందని..అంతిమంగా ఇది పార్టీకే నష్టం చేస్తుందని ఓ సీనియర్ నేత వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీపై మొదటి నుంచి ఓ విమర్శ ఉంది. ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు క్షేత్రస్థాయిలో సీరియస్ గా పనిచేసే వాళ్ళ కంటే ఎక్కువ సమయం మీడియాలో కనపడే వారే బాగా పనిచేస్తున్నట్లు చంద్రబాబు భావిస్తుంటారు. అక్కడే చాలా సార్లు లెక్కలు కూడా తప్పుతుంటాయి. ఇప్పటికైనా చంద్రబాబు అండ్ కో ‘క్వాంటిటీ కంటే క్వాలిటీ’పై ఫోకస్ పెడితే బాగుంటుందని ఓ నేత వ్యాఖ్యానించారు.