Telugu Gateway
Andhra Pradesh

‘ప్రత్యేక కేసు’గా చంద్రబాబు పర్యటనకు అనుమతి

‘ప్రత్యేక కేసు’గా చంద్రబాబు పర్యటనకు అనుమతి
X

తెలుగుదేశం అధినేత, ఏపీ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడి విశాఖ పర్యటనకు అనుమతి లభించింది. విశాఖపట్నంతోపాటు అక్కడ నుంచి అమరావతిలోని ఉండవల్లి నివాసానికి రోడ్డు మార్గంలో వెళ్ళటానికి ‘ప్రత్యేక అనుమతి’ ఇస్తున్నట్లు ఏపీ డీజీపీ తన అనుమతి పత్రంలో పేర్కొన్నారు. కరోనా నేపథ్యంలో వేరే రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వారు ఇతర రాష్ట్రాలకు వస్తున్నప్పుడు వైద్య ఆరోగ్య శాఖ ప్రోటోకాల్ ప్రకారం పరీక్షలు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. హోం క్వారంటైన్ లో పెట్టాల్సి ఉంటుందని..పరీక్షల్లో నెగిటివ్ అని తేలిన తర్వాతే అనుమతి ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అయినప్పటికీ హైదరాబాద్ నుంచి విశాఖపట్నానికి, అక్కడ నుంచి అమరావతిలోని ఉండవల్లి పర్యటనకు వినతి వచ్చినందున దీన్ని ప్రత్యే కేసుగా అనుమతిస్తున్నట్లు పేర్కొన్నారు.

కోవిడ్ 19 సందర్భంగా ఇఛ్చే ఈ పాస్ ను జతచేస్తున్నట్లు తెలిపారు. అదే సమయంలో కరోనా సందర్భంగా అమల్లో ఉన్న వివిధ మార్గదర్శకాలు పాటించాల్సిందిగా అనుమతి పత్రంలో పేర్కొన్నారు. దీంతో చంద్రబాబు సోమవారం ఉదయం 10 గంటలకు హైదరాబాద్ నుంచి విమానంలో విశాఖకు వెళ్ళనున్నారు. అక్కడ వెంకటాపురం గ్రామంలో మృతుల కుటుంబాలను పరామర్శిస్తారు. సాయంత్రం రోడ్డుమార్గంలో అమరావతి నివాసానికి చేరుకోనున్నారు. గత కొన్ని నెలలుగా చంద్రబాబు హైదరాబాద్ లోనే ఉన్న విషయం తెలిసిందే. దీంతో మహానాడు కూడా అమరావతి నుంచే చంద్రబాబు నిర్వహించనున్నారు. ఈ సారి జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా మహానాడు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. సోమవారం నాడు చంద్రబాబుతోపాటు ఎమ్మెల్సీ నారా లోకేష్ కూడా ఏపీకి వెళుతున్నారు.

Next Story
Share it