Telugu Gateway
Politics

మోడీ సర్కారును ఇరకాటంలోకి నెట్టిన సోనియా ప్రకటన!

మోడీ సర్కారును ఇరకాటంలోకి నెట్టిన సోనియా ప్రకటన!
X

కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ మోడీ సర్కారును ఇరకాటంలోకి నెట్టారు. తాజాగా కేంద్రం వలస కార్మికులు ఎక్కడి వారు అక్కడికి వెళ్లిపోవటానికి అనుమతి మంజూరు చేసింది. అయితే అందుకు అయ్యే రైలు ఖర్చులను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే భరించాలని తేల్చిచెప్పింది. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. కేంద్రం ప్రకటనలు ఇచ్చి చేతులు దులుపుకుంటుందనే పలు రాష్ట్రాలు విమర్శించాయి కూడా. ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ కీలక ప్రకటన చేశారు. ఏ రాష్ట్రం నుంచి అయినా వలస కార్మికులు తమ స్వస్థలాలకు వెళ్ళేందుకు రెడీ అయితే ఆ ఖర్చును తాము భర్తిస్తామని పేర్కొన్నారు. ఆయా రాష్ట్రాల పీసీసీలు ఈ బాధ్యత తీసుకుంటాయని తెలిపారు. సోనియా ప్రకటన రాజకీయంగా అత్యంత కీలకంగా మారింది. నిజంగా దేశంలో లాక్ డౌన్ వల్ల తీవ్ర ఇబ్బందుల పాలు అవుతున్న వర్గం ఏదైనా ఉంది అంటే అది వలస కార్మికులే అని ఖచ్చితంగా చెప్పొచ్చు. దేశ నిర్మాణంలో కీలక భూమిక పోషించే కార్మికుల విషయంలో కేంద్రం సరిగా స్పందించలేదని ఆమె ఆరోపించారు.

గంటల వ్యవధిలోనే లాక్ డౌన్ ప్రకటన చేసిన కేంద్రం వలస కార్మికులు తమ సొంత ప్రాంతాలకు వెళ్ళే ఛాన్స్ లేకుండా చేసిందని ఆమె ఆరోపించారు.1947 తర్వాత భారత్ ఇంత విషాదకర పరిస్థితిని ఎప్పుడూ చూడలేదని సోనియా వ్యాఖ్యానించారు. చాలా మంది కార్మికులు విధిలేక వందల కిలోమీటర్లు నడుచుకుంటూ రోడ్డున పడటం దారుణం అని పేర్కొన్నారు. కేంద్రం ఈ విషయంలో బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. వారి రవాణా ఖర్చులను భరించటం ద్వారా తమ వంతు వారికి చిన్న సాయం చేయటానికి ముందుకొచ్చినట్లు తెలిపారు. ప్రస్తుత సంక్లిష్ట తరుణంలో అందరూ భుజం భుజం కలపి నడవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అయితే కాంగ్రెస్ సాయాన్ని ఆయా రాష్ట్రాలు, కేంద్రం ఆమోదిస్తుందా అన్నది వేచిచూడాల్సిందే.

Next Story
Share it