Telugu Gateway
Andhra Pradesh

జగన్ సర్కారుకు షాక్..నిమ్మగడ్డ తొలగింపు చెల్లదు

జగన్ సర్కారుకు షాక్..నిమ్మగడ్డ తొలగింపు చెల్లదు
X

ఏపీలోని జగన్మోహన్ రెడ్డి సర్కారు కు బిగ్ షాక్. మాజీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగింపు చెల్లదని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో పాటు వెంటనే ఎస్ఈసీగా రమేష్ కుమార్ ను విధుల్లోకి తీసుకోవాలని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వం పంచాయతీరాజ్ చట్టంలో సవరణలు చేయటం ద్వారా ఆర్డినెన్స్ ను తీసుకొచ్చి ఎస్ఈసీ పదవీ కాలాన్ని ఐదేళ్ల నుంచి మూడేళ్లకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో రమేష్ కుమార్ పదవి పోయినట్లు అయింది. అంతే కాదు..ఆగమేఘాల మీద తమిళనాడుకు చెందిన మాజీ న్యాయమూర్తి కనగరాజ్ ను కొత్త ఎస్ఈసీగా జగన్ సర్కారు నియమించింది. అయితే ఏపీ సర్కారు తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ను హైకోర్టు కొట్టివేసింది. అంతే కాదు..దీనికి సంబంధించి తీసుకొచ్చిన జీవోలు అన్నింటిని హైకోర్టు కొట్టివేసింది.

అయితే ఇఫ్పుడు ఆర్డినెన్స్ పై సంతకం పెట్టిన రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ఒక రకంగా చిక్కుల్లో పడినట్లు అయింది. ఆర్డినెన్స్ పై గవర్నర్ సంతకం చేయటంపై కూడా అప్పట్లో విమర్శలు వెల్లువెత్తాయి. ఎస్ఈసీ తొలగింపు అంశంపై హైకోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగిన తర్వాత హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసి..శుక్రవారం నాడు తుది తీర్పు వెలువరించింది. ఆర్టికల్ 213 ప్రకారం ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్డినెన్స్ తెచ్చే అధికారం ప్రభుత్వానికి లేదని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ క్షణం నుంచి రమేష్ కుమార్ ఎస్ఈసీగా కొనసాగుతారని హైకోర్టు ప్రకటించింది. కరోనా కారణంగా ఎస్ఈసీగా ఉన్న రమేష్ కుమార్ స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయటం రాష్ట్రంలో పెద్ద వివాదానికి కారణం అయింది. ఈ అంశంపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విలేకరుల సమావేశం పెట్టి మరీ రమేష్ కుమార్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Next Story
Share it