Telugu Gateway
Andhra Pradesh

వాళ్లకూ..మాకూ తేడా అదే

వాళ్లకూ..మాకూ తేడా అదే
X

‘గత ప్రభుత్వంలో జన్మభూమి మాఫియా కమిటీలు ఉండేవి. ఏ పని కావాలన్నా వాళ్ల సంతకం ఉంటేనే జరిగేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. గత ఏడాది కాలంలో ఎక్కడా అవినీతి లేకుండా పరిపాలన సాగిస్తున్నాం. ప్రతి పని నిజాయతీ, నిబద్ధతతో చేస్తున్నాం. మా మ్యానిఫెస్టో కేవలం రెండు పేజీలే ఉంటుంది. అది అందరి దగ్గరా ఉంటుంది. కానీ గత ప్రభుత్వంలో 650కిపైగా హామీలు ఇఛ్చి..ఏమి చేశారో అందరూ చూశారు. ’ అని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జగన్ అధికారంలోకి వచ్చి ఏడాది అయిన సందర్భంగా ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించారు. అదే సమయంలో ఏడాది పాలనపై స్పందించారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం నుంచే ఈ కార్యక్రమంలో పాల్గొన్న జగన్..ఏడాది పాలన పూర్తి అయిన సందర్భంగా ఇలా రైతులకు సంబంధించిన కార్యక్రమంలో పాల్గొనటం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ప్రతి గ్రామంలో రైతుభరోసా కేంద్రాలు ప్రారంభమయ్యాయని, రైతుభరోసా కేంద్రాలతో గ్రామాల్లో విప్లవాత్మక మార్పు రాబోతుందని వ్యాఖ్యానించారు.

రైతుకు అవసరమైన సమయంలో సహాయం అందాలని, విత్తనం నుంచి పంట అమ్మకం వరకు రైతులకు అడుగడుగునా తోడుగా ఉంటామని భరోసానిచ్చారు. తొలి ఏడాది పాలన నిజాయితీతో, చిత్తుశుద్ధితో గడిచిందన్నారు. తాను రాజకీయాల్లోకి వచ్చి 11 సంవత్సరాలు అయిందని..ఈ ప్రయాణంలో కోట్ల మందిని కలసి ఉంటానని..రాష్ట్రంలో ప్రతి ప్రాంతం తనకు తెలుసని అన్నారు. అందుకే అన్ని వర్గాల ప్రజల కోసం సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినట్లు వెల్లడించారు. ‘వైఎస్‌ జగన్‌ అనే నేను.. ఏడాది కాలంగా.. మీ కుటుంబ సభ్యుడిగా.. నేను చేసిన ప్రమాణానికి అనుగుణంగా మీ కోసం పనిచేస్తున్నానని స్పష్టం చేస్తున్నా. సీఎం కార్యాలయం నుంచి ప్రతి అధికారి దగ్గరా మేనిఫెస్టోను ఉంచాం. మేం ఇచ్చిన 129 హామీల్లో.. ఇప్పటికే 77 అమలు చేశాం. అమలు కోసం మరో 36 హామీలు సిద్ధంగా ఉన్నాయి. మిగిలిన 16 హామీలను కూడా త్వరలోనే పరుగులు పెట్టిస్తాం. మేనిఫెస్టోలో లేని మరో 40 హామీలను కూడా అమలు చేశాం’’ అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

Next Story
Share it