Telugu Gateway
Andhra Pradesh

నాగబాబు అభిప్రాయాలతో పార్టీకి సంబంధం లేదు

నాగబాబు అభిప్రాయాలతో పార్టీకి సంబంధం లేదు
X

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ‘నాగబాబు ట్వీట్ల’ వ్యవహారంపై స్పందించారు. తాజాగా ఆయన చేసిన ట్విట్టర్ లో వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. తొలుత గాంధీని చంపిన గాడ్సే దేశ భక్తుడు అంటూ వ్యాఖ్యానించి కలకలం రేపారు. తాజాగా దేశ కరెన్సీ నోట్లపై ఒక్క గాంధీ ఫోటోనే ఎందుకు?. సుభాస్ చంద్రబోస్, భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్ వంటి మరి కొంత మంది నేతల పేర్లను ప్రస్తావించారు. ‘జనసేన పార్టీలో లక్షలాదిగా వున్న నాయకులు, జన సైనికులు, అభిమానులు సామాజిక మాధ్యమాలలో వ్యక్తం చేసే అభిప్రాయాలు వారి వారి వ్యక్తిగత అభిప్రాయాలేగానీ.. పార్టీకి ఎటువంటి సంబంధం లేదని మరోసారి స్పష్టం చేస్తున్నాను. గతంలో కూడా మీడియా ద్వారా ఇదే విషయాన్ని మీకు తెలిపాం. ఈ మధ్యకాలంలో కూడా కొన్ని సున్నితమైన అంశాలపై పార్టీకి చెందినవారు వ్యక్తం చేస్తున్న భావాలను పార్టీ అభిప్రాయాలుగా ప్రత్యర్ధులు వక్రీకరిస్తున్నందున మరోసారి ఈ విషయాన్ని మీకు విశదీకరిస్తున్నాను. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు నాగబాబు సోషల్ మీడియాలో వ్యక్తపరుస్తున్న అభిప్రాయాలు పూర్తిగా ఆయన వ్యక్తిగతమైనవి.

పార్టీకి ఎటువంటి సంబంధమూ లేదు. పార్టీ అభిప్రాయాలను, నిర్ణయాలను పార్టీ అధికార పత్రం ద్వారా, పార్టీ అధికారిక సామాజిక మాధ్యమాల ద్వారా ఎప్పటికప్పుడు తెలియచేస్తూనే ఉన్నాము. వాటిని మాత్రమే పరిగణలోకి తీసుకోవలసిందిగా కోరుతున్నాను. ఈ సందర్భంగా జనసేన పార్టీకి చెందిన ప్రతి ఒక్కరికీ ఒక మాట చెబుతున్నా... ఇది ప్రజలు అనుకోని కష్టాలను ఎదుర్కొంటున్న కాలం. కరోనాతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఈ తరుణంలో మనం ప్రజాసేవ తప్ప మరేతర అంశాల జోలికి వెళ్లవద్దని కోరుతున్నాను. క్రమశిక్షణను అతిక్రమించకుండా ప్రజాసేవలో ముందుకు సాగాలని విజ్ఞప్తి చేస్తున్నాను.’ అని పేర్కొన్నారు.

Next Story
Share it