Telugu Gateway
Andhra Pradesh

ఏపీలో వైద్య శాఖ ఫెయిల్

ఏపీలో వైద్య శాఖ ఫెయిల్
X

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ సర్కారు కరోనా నియంత్రణ చర్యలపై మండిపడ్డారు. స్వయంగాముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కరోనా సమస్యను సాదారణ జ్వరమే అంటూ తేలిగ్గా మాట్లాడటం వల్లే నివారణ చర్యల్లో అలసత్వం నెలకొందని ఆయన విమర్శించారు. ఆరోగ్య శాఖ పటిష్టంగా లేని ఫలితం కరోనా తో భయపడుతోందని పేర్కొన్నారు. పాలనా విభాగం వైఫల్యానికి రాజకీయ నాయకత్వమే బాధ్యత వహించాలని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. తెలంగాణలో కరోనా నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకోకపోతే తమ పరిస్థితి కూడా కర్నూలు, గుంటూరులా మారేదని తెలంగాణ మంత్రి వ్యాఖ్యానించారంటే ఏపీలో పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చని అన్నారు. అనంతపురం జిల్లా నేతలతో పవన్ కళ్యాణ్ పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తో కలసి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ “గ్రీన్ జోన్ ప్రాంతాలు ఆరెంజ్, ఆరెంజ్ జోన్ ప్రాంతాలు రెడ్ పరిధిలో రాకుండా చూసుకోవడమే అసలు సవాల్. ఈ విషయంలో రాష్ట్ర పాలన యంత్రాంగం చాలా అప్రమత్తంగా, సమర్థంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఇది సాధారణ పని చేయాలని తపించే అధికారులు నిస్సహాయంగా అయిపోయారు.

కేరళ లాంటి రాష్ట్రాలు ముందు నుంచీ ప్రజారోగ్యం విషయంలో పకడ్బందీగా ఉండటంతో కరోనా విషయంలో సమర్థంగా వ్యవహరించగలిగాయి. మన రాష్ట్రంలోని క్వారంటైన్ కేంద్రాల్లో ఉంచినవారికి సరైన సదుపాయాలు లేవనీ, సక్రమంగా ఆహారం అందటం లేదనే విషయం తెలిసింది. ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు మన పార్టీ తరఫున సామాజిక మాధ్యమాల ద్వారా బలంగా మాట్లాడదాం. ఈ మాధ్యమంలో మన పార్టీ శ్రేణులు ఎంతో చురుగ్గా ఉన్నారు. ఎప్పటికప్పుడు సమస్యలను చెబుతూ... మన బాధ్యతగా మన పార్టీ ఏం చేస్తుందో చెబుదాం. ఇసుక విధానంతో, ఇప్పుడు కరోనాతో ఉపాధి కోల్పోయారు భవన నిర్మాణ కార్మికులు. కార్మికులు, చేతి వృత్తుల వారికి ప్రభుత్వం భరోసా ఇవ్వాలి. కరోనా మూలంగా ఇబ్బందుల్లో ఉన్న ప్రజలకు జనసేన నాయకులు, శ్రేణులు అందిస్తున్న సేవలు ప్రశంసనీయం” అన్నారు.

పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ “కరోనా మూలంగా ప్రధానంగా హిందూపురం ప్రాంతం భయాందోళనలో ఉంది. జిల్లాలో అత్యధిక కేసులు ఆ ప్రాంతంలోనే నమోదవుతున్నాయి. అదే విధంగా అనంతపురం పట్టణ ప్రాంతం కూడా అలాగే ఉంది. కరోనా మూలంగా జిల్లాలోని రైతులు తమ పంటలు అమ్ముకోలేకపోతున్న విషయం జిల్లా నాయకుల ద్వారా పార్టీ అధ్యక్షుల దృష్టికి వచ్చింది. చీనీ, అరటి, దానిమ్మ, మామిడి లాంటి ఉద్యానపంటల రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి. ధరల స్థిరీకరణ నిధి అని, మార్కెటింగ్ శాఖ ద్వారా కొనుగోలు అంటూ ప్రభుత్వం పెద్ద మాటలు చెప్పింది. వాటిని అమలులో చూపించాలి. రైతాంగం ఎదుర్కొంటున్న ఇక్కట్లను కేంద్రం దృష్టికి తీసుకువెళ్తాం. కరోనా విపత్తు ఉన్న సమయంలో జిల్లాలో ఇసుక అక్రమ తవ్వకాలు సాగిస్తున్నట్లు సమాచారం ఉంది. ఈ అక్రమాలపై పార్టీ నాయకులు దృష్టి సారించాలి. ’ అని పేర్కొన్నారు.

Next Story
Share it