ఎల్ జీ పాలిమర్స్ పై చర్యలు తీసుకోవాల్సిందే

ప్రజల రక్షణ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎల్ జి పాలిమర్స్ సంస్థపై కఠిన చర్యలు చేపట్టాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. అయితే ప్రభుత్వం ఆ పరిశ్రమను రక్షించే విధంగా వత్తాసు పలుకుతోందనే ఆగ్రహం, ఆవేదన ఆ ప్రాంతాలవారిలో ఉందని అన్నారు. తమ గ్రామాలకు ముప్పులా పరిణమించిన ఈ పరిశ్రమను తక్షణం తరలించడంతోపాటు అక్కడి ప్రజల ఆరోగ్య సమాచారాన్ని తీసుకొని అందరికీ జీవిత కాల వైద్యాన్ని అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సహేతుకమైన ఆ ప్రాంత ప్రజల డిమాండ్లకు అనుగుణంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.
విశాఖపట్నంలోని ఆర్.ఆర్.వెంకటాపురంతోపాటు పరిసరాల్లోని పద్మనాభ నగర్, వెంకటాపురం, ఎస్సీ,బీసీ కాలనీ, నందమూరి నగర్ ప్రాంతాలవారు ఈ పరిశ్రమతో ముప్పు పొంచి ఉందనిభయాందోళనలకు గురవుతున్న విషయం తన దృష్టికి వచ్చిందని తెలిపారు. ఆ బాధిత ప్రాంతాల ప్రజలు ఈ సంస్థను అక్కడి నుంచి తరలించాలి అనే ప్రధాన డిమాండ్ తోపాటు పలు విషయాలను తెలియచేస్తూ లేఖ రాశారు. ఎల్జీ పాలిమర్స్ బాధిత గ్రామాల ప్రజలకు జనసేన పార్టీ అండగా నిలుస్తుంది. వారికి న్యాయం జరిగే వరకూ వెన్నంటి ఉంటుందని పేర్కొన్నారు.