Telugu Gateway
Andhra Pradesh

టీటీడీ భూముల అమ్మకంపై పవన్ కళ్యాణ్ ప్రశ్నలు

టీటీడీ భూముల అమ్మకంపై పవన్ కళ్యాణ్ ప్రశ్నలు
X

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) భూముల అమ్మకం ప్రతిపాదనను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తప్పుపట్టారు. అసలు ఆ భూములు అమ్మాల్సిన అవసరం ఎందుకొచ్చిందని ప్రశ్నించారు. టీటీడీ భూములు అమ్మటం ఓ చెడు సంప్రదాయాన్ని నెలకొల్పుతుందని పేర్కొన్నారు. ఆయన ఈ అంశంపై ట్విట్టర్ వేదికగా స్పందించారు. భూముల అమ్మకం ప్రతిపాదన వల్ల కోట్లాది మంది వెంకటేశ్వరస్వామి భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని పేర్కొన్నారు. దేశంలోని అన్ని హిందూ ధార్మిక సంస్థలు టీటీడీ వైపు చూస్తుంటే..ఉత్తమ విధానాలతో నిలవాల్సిన టీటీడీలో భూముల అమ్మకం ఏ మాత్రం సరికాదన్నారు. ట్విట్టర్ లో పవన్ ప్రస్తావించిన అంశాలు..‘రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ భారీగా నష్టపోయింది... ఇంకా నష్టపోతూనే ఉంది.

ఇప్పుడున్న పరిస్థితులలో వైసీపీ ప్రభుత్వం టి.టి.డి. భూముల అమ్మకాలకు అనుమతి ఇచ్చినట్లయితే... అది భక్తుల మనోభావాలను, విశ్వాసాలను దెబ్బ తీయడం మాత్రమే కాదు. రాష్ట్ర భవిష్యత్ ఆర్థిక అవకాశాలను ప్రమాదంలో పడేసే తీవ్రమైన తప్పిదంగా మిగులుతుంది. తిరుమల తిరుపతి దేవస్థానం తమకు చెందిన స్థిరాస్తులను అమ్మి వేసి మార్పు చేసుకొనేందుకో, తనఖా పెట్టుకొనేందుకో పాటించాల్సిన ప్రామాణికాలను 1990లో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం స్పష్టీకరించింది. చాప్టర్ 22 లోని రూల్ 165 ప్రకారం తేదీ 09-04-1990 నాడు జారీ చేసిన జీవో ఎమ్.ఎస్. నెం.311 రెవెన్యూ (ఎండోమెంట్స్ 1) లో ఆ వివరాలున్నాయి. స్థిరాస్తుల అమ్మకం/తనఖా విషయంలో టి.టి.డి. ఈ మూడు ప్రామాణికాలను పాటించాల్సి ఉంటుంది.

1) తిరుమల తిరుపతి దేవస్థానానికి అవసరం వచ్చినప్పుడు లేదా లాభదాయకం అయినప్పుడు..

2) ఇది తిరుమల తిరుపతి దేవస్థానం యెక్క లక్ష్యాలకు అనుగుణంగా ఉన్నసందర్భాలలో

3) అయితే... ఆ కారణాలు సహేతుకంగా, సరైన విధంగా ఉన్నపక్షంలో మాత్రమే ఆ అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.

తమిళనాడు రాష్ట్రంలోని దాదాపు 25 భూములకు చెందిన ఆస్తులను అమ్మకం అనేది పైన పేర్కొన్న ప్రామాణికాలకు అనుగుణంగా ఉన్నాయా అన్నది రాష్ట్ర ప్రభుత్వం మరియు టి.టి.డి. బోర్డు వివరణ ఇవ్వాలి అని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు.

Next Story
Share it