Telugu Gateway
Cinema

ఓటీటీల కోసమే కొత్త సినిమాలు..టాలీవుడ్ రెడీ!

ఓటీటీల కోసమే కొత్త సినిమాలు..టాలీవుడ్ రెడీ!
X

సాంకేతిక విప్లవం వినోద రంగంలో ఎన్నో మార్పులు తెచ్చింది. అందులో ప్రధానమైనది ఓవర్ ది టాప్ (ఓటీటీ) మీడియా సర్వీసెస్. కరోనా సినీ రంగాన్ని ఎలా దెబ్బతీసిందో అలాగే ఓటీటీకి సమస్యలు తెచ్చిపెడుతోంది. పెద్ద సినిమా..చిన్న సినిమా అన్న తేడా లేకుండా లాక్ డౌన్ తో ప్రస్తుతం అన్ని సినిమాల ఆగిపోయాయి. ఇప్పటికే ట్రాక్ లో ఉన్న సినిమాలు కొన్నే. కొత్త సినిమాలు తెరకెక్కాలంటే తక్కువలో తక్కువ ఏడాది సమయం పడుతుందని ఓ అంచనా. ఈ సమయంలో కరోనా సంక్షోభం తొలగి పెండింగ్ లో పడిపోయిన సినిమాలు పూర్తి కావటానికి కూడా సమయం పడుతుంది. ఉన్నవి ఎప్పటికి పూర్తి అవుతాయి..కొత్తవి ఎప్పటికి రెడీ అవుతాయి. మరి ఈ సమయంలో ఓటీటీని ప్రేక్షకుల ఎలా ఆదరిస్తారు. ఇదే ఇఫ్పుడు ఓటీటీల ముందు ఉన్న ప్రధాన సమస్యగా మారింది. అందుకే ఓటీటీలు నేరుగా రంగంలోకి దిగుతాయి. ఇప్పటికే ఈ మార్కెట్లో పెద్ద ఎత్తున పట్టు సాధించిన అమెజాన్ నేరుగా రంగంలోకి దిగింది. ఈ సంస్థ టాలీవుడ్ దర్శకులతో కొత్త సినిమాల కోసం సంస్థ చర్చలు ప్రారంభించిందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. తక్కువ వ్యయంతో కేవలం ఓటీటీ ఫ్లాట్ ఫాం కోసమే సినిమాలు నిర్మించేందుకు రంగం సిద్ధం అవుతోంది. ఓటీటీ ఫ్లాట్ ఫాంల మార్కెట్ కు సరిపోయేలా అందుకు అనుగుణంగా దర్శకులు, హీరో..హీరోయిన్లను ఎంపిక చేయనున్నారు.

అమెజాన్ తో పాటు ఆహా, జీ5 వంటి ఓటీటీలు కూడా కొత్త కంటెంట్ కోసం రంగంలోకి దిగాయి. ఓ వైపు కొత్త వెబ్ సిరీస్ లతోపాటు కొత్త సినిమాలు చేయటానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్న టాలీవుడ్ వర్గాలు తెలిపాయి. ఎందుకంటే కొత్త సినిమాలు వచ్చే వరకూ తమ కస్టమర్లకు కొత్త కంటెంట్ ఇవ్వకపోతే వాళ్లను నిలుపుకోవటం కష్టం అన్న విషయం ఓటీటీలకు తెలుసు. అందుకే ఈ సంక్షోభ సమయంలో పాత వినియోగదారులను నిలుపుకోవటంతో కొత్త వాళ్లను ఆకర్షించాలంటే కొత్త కంటెంట్ తప్పనిసరి కావటంతో ఈ దిశగా ఆయా సంస్థలు అడుగులు వేస్తున్నాయి. దీంతో మీడియం రేంజ్ దర్శకులు, నటీ, నటులకు అవకాశాలు మెరుగయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. వీరి ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో వేచిచూడాల్సిందే.

Next Story
Share it