Top
Telugu Gateway

టాలీవుడ్ లో ఆదిపత్యపోరు

టాలీవుడ్ లో ఆదిపత్యపోరు
X

తెలుగు సినిమా పరిశ్రమలో కొత్త వివాదం. నిత్యం ఈ పరిశ్రమకు చెందిన వారందరూ మేం అంతా ఒకటే అని చెబుతారు. కానీ ఎప్పుడూ ఒక్కటిగా మాత్రం ఉండరు. ఒకరంటే ఒకరికి పడదు. ఒకరి నిర్ణయాన్ని మరొకరు ఒప్పుకోరు. ఓ సారి ‘మా’ సమావేశంలోనూ రచ్చ రచ్చ జరిగింది. ఇప్పుడు కరోనా సంక్షోభ సమయంలోనూ విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. అయితే ఈ సారి వివాదానికి కారణం అయింది సీనియర్ హీరో, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. కొద్ది రోజుల క్రితం చిరంజీవి నివాసంలో జరిగిన సినీ ప్రముఖుల సమావేశం.. ఆ తర్వాత ముఖ్యమంత్రి కెసీఆర్ తో భేటీ విషయం కేవలం ‘కొంత మంది’ వ్యవహారంగానే సాగిందనే విమర్శలు విన్పిస్తున్నాయి. బడాబడా నిర్మాతలు..దర్శకులు మాత్రమే ఈ సమావేశానికి హాజరు అయ్యారని..వాస్తవానికి ఏటా ఎక్కువ సినిమాలు తీసే చిన్న, మధ్యతరహా నిర్మాతలు ఎవరికీ ఇందులో చోటు దక్కలేదనే విమర్శలు ఉన్నాయి. తాజా పరిణామాల నేపథ్యంలో టాలీవుడ్ లో ఆదిపత్య పోరు నడుస్తుందనే విషయం స్పష్టం అవుతోందని పరిశ్రమకు చెందిన ప్రముఖుడు ఒకరు వ్యాఖ్యానించారు.

పరిశ్రమకు చెందిన తాజా సమావేశం వివరాలు ఏమీ తనకు తెలియదని..తననూ ఎవరూ పిలవలేదని వ్యాఖ్యానించిన బాలకృష్ణ, మంత్రి తలసానితో కలసి పరిశ్రమ వాళ్లు భూములు పంచుకుంటున్నారా అని ప్రశ్నించటంతో పెద్ద దుమారం రేగింది. అయితే నిర్మాత సి. కళ్యాణ్ మాట్లాడుతూ పరిశ్రమలో దాసరి తర్వాత పెద్ద దిక్కు చిరంజీవే అని..అందుకే అందరూ ఆయన నివాసంలో సమావేశం అయ్యారని వ్యాఖ్యానించటం ద్వారా ‘దాసరి’ స్థానం కోసం ఫైట్ జరుగుతోందనే విషయం స్పష్టం అవుతోందని చెబుతున్నారు పరిశ్రమ ప్రముఖులు. దాసరి నారాయణరావు జీవించి ఉన్న సమయంలో పరిశ్రమలో ఏ సమస్య వచ్చినా అందరూ ఆయన దగ్గరకే వెళ్లేవారు. దాసరి మరణంతో అంతటి ఆమోదం ఉన్న పెద్ద తలకాయ లేకుండా పోయారు. ఉన్నంతలో చాలా మంది చిరంజీవి వైపు మొగ్గుచూపుతున్నారు.

అయితే కొంత మంది మాత్రం చిరంజీవి సమావేశాలకు దూరంగా ఉంటున్నారు. తాజా పరిణామాలతో పరిశ్రమలో పరిశ్రమలో ఐకమత్యం లేదనే విషయం మరోసారి బహిర్గతం అయింది. గతంలో ఎప్పుడూ ఇలాంటి సమావేశాలకు బయటకు రాని ప్రముఖ దర్శకులు రాజమౌళి, త్రివిక్రమ్ శ్రీనివాస్ వంటి వారు కూడా ఈ సారి బయటకు వచ్చారు. అందుకు కారణం ప్రస్తుతం వారి వారి సొంత ప్రయోజనాలే ముఖ్యంగా ఉన్నాయని ఓ పరిశ్రమ ప్రముఖుడు వ్యాఖ్యానించారు. కరోనా సంక్షోభ సమయంలో షూటింగ్ కు అనుమతుల అంశంపై సీనియర్ హీరోలు చిరంజీవి, నాగార్జునలే కీలక పాత్ర పోషించారు కానీ..ప్రస్తుతం భారీ మార్కెట్ ఉన్న యువ హీరోలు ఎవరూ ఈ మొత్తం వ్యవహారంలో ఎక్కడా కన్పించకపోవటం..విన్పించకపోవటం కూడా ఆసక్తికరంగా మారింది. సహజంగా పరిశ్రమ సమస్య అన్నప్పుడు అందరి భాగస్వామ్యంతో ముందుకు సాగాలి కానీ..ఇది ఎవరో కొంత మంది ప్రైవేట్ వ్యవహారంగా సాగటం సరికాదనే వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. బాలకృష్ణను ఈ సమావేశానికి దూరం పెట్టటం ద్వారా ఏపీలో జగన్ సర్కారుకు..తెలంగాణలో కెసీఆర్ కు తమదే కీలకపాత్ర అని చెప్పే ప్రయత్నం చేశారనే వ్యాఖ్యలూ విన్పిస్తున్నాయి.

Next Story
Share it