Telugu Gateway
Andhra Pradesh

జీవో ఇచ్చాక సర్వే చేస్తారట..ఏపీ సర్కారు వింత నిర్ణయం

జీవో ఇచ్చాక సర్వే చేస్తారట..ఏపీ సర్కారు వింత నిర్ణయం
X

పాఠశాలల్లో మాధ్యమంపై ఎన్డీటీవీకి సర్వే బాధ్యతలు

ఆ సంస్థకు మేలు చేసేందుకే

‘సర్కారు ఎప్పుడో ఓ నిర్ణయం తీసుకుంది. సర్కారు నిర్ణయాన్ని తప్పుపట్టిన వారిని తుప్పు వదిలేలా తిట్టింది. అల్రెడీ సర్కారు తీసుకున్న నిర్ణయంపై ఇప్పుడు రాష్ట్ర వ్యాప్త సర్వే చేస్తుంది అంట ఆ సంస్థ. నిర్ణయం తీసేసుకుని..అమలుకు జీవో ఇచ్చేసి..ఇప్పుడు కొత్తగా సర్వే చేసి ఏమి తేలుస్తారు?. సర్కారు నిర్ణయానికి భిన్నంగా ఫలితాలు వస్తాయా?. సాక్ష్యాత్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, మంత్రులు..ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు బహిరంగంగా ఆంగ్ల మాధ్యమానికి అనుకూలంగా వాదనలు చేస్తే..సర్కారు దగ్గర డబ్బులు తీసుకుని సర్వే చేసే సంస్థ నిజంగా అందుకు వ్యతిరేకంగా ఫలితాలు వచ్చినా చెప్పగలదా?. అది జరిగే పనేనా?.’ ఇవీ సర్కారు జీవో చూసిన తర్వాత తలెత్తే ప్రశ్నలు. ఏపీలోని ప్రభుత్వ స్కూళ్ళలో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టేందుకు ఉద్దేశించి సర్కారు జారీ చేసిన జీవో తొలుత పెద్ద దుమారం రేపటం..తర్వాత ఈ అంశం హైకోర్టుకు చేరటం తెలిసిందే. అయితే హైకోర్టు మాత్రం సర్కారు జీవోలను కొట్టేసింది.

ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెడుతూ జీవో ఇఛ్చాక పేరెంట్స్ కమిటీ అభిప్రాయాలు తీసుకోవటం సరికాదన్నారు. అదే సమయంలో స్టేట్ కౌన్సిల్ ఆప్ ఎడ్యుకేషనల్ రిసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎస్ సీఈఆర్ టి) అభిప్రాయం తీసుకోవాలని హైకోర్టు సూచించింది. ఆ తర్వాత ప్రభుత్వం వెంటనే ఎస్ సీఈఆర్ టీ నుంచి అభిప్రాయం తెప్పించుకుని తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది కూడా. ఆంగ్ల మాధ్యమంతోపాటు మండల కేంద్రంలో తెలుగు మీడియం స్కూళ్ళను ఏర్పాటు చేస్తామని పేర్కొంది. సుప్రీంకోర్టులో హైకోర్టు తీర్పును సవాల్ చేసిన సర్కారు సుప్రీం తుది ఆదేశాల ప్రకారం నడుచుకుంటామని ఆంగ్ల మాధ్యమం అమలుకు తాజాగా జారీ చేసిన జీవోలో పేర్కొంది. ఇదంతా ఒకెత్తు అయితే అయిపోయిన పెళ్ళికి భాజాలు అన్నట్లు ఇప్పటికే తీసుకున్న నిర్ణయంపై ఇంకా ఎన్డీటీవీ రాష్ట్రవ్యాప్తంగా సర్వే చేసేది ఏంటి?. తేల్చేది ఏమిటి అన్నదే చర్చనీయాంశంగా మారింది. అసలు కరోనా విజృంభన సమయంలో సర్వే చేయటం సాధ్యం అయ్యే పనేనా?.

ఎన్డీటీవీ రాష్ట్ర వ్యాప్త సర్వేకు, పాఠశాల విద్యలో ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి ఏడు షార్ట్ పిల్మ్ లు తీయటానికి ప్రతిపాదన ఇవ్వటం, దీనికి సర్కారు ఓకే చేయటం జరిగిపోయింది. దీనికి అయ్యే వ్యయాన్ని సమగ్ర శిక్ష కార్యక్రమం నిధులను వాడుకోనున్నట్లు తెలిపారు. అయితే ఇది ఎంత మొత్తం అన్న వ్యవహారాన్ని జీవోలో ప్రస్తావించకపోవటంతో పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. ఎన్డీటీవీకి కార్యక్రమం అప్పగించాలని నిర్ణయించిన తర్వాత అది ఎంత మొత్తం..ఏమిటనే విషయాలు స్పష్టత వచ్చాకే జీవో ఇస్తారు. కానీ జీవోలో మాత్రం ఈ సంస్థకు ఎంత చెల్తిస్తున్నారు అనే అంశాన్ని ప్రస్తావించకపోవటం పలు అనుమానాలు రేకెత్తిస్తోంది. ఆ సంస్థకు ప్రయోజనం చేకూర్చేందుకే ఇప్పటికే తీసుకున్న నిర్ణయంపై రాష్ట్ర స్థాయి సర్వే బాధ్యతలు అప్పగించారనే విమర్శలు విన్పిస్తున్నాయి.

Next Story
Share it