Telugu Gateway
Andhra Pradesh

సీట్లు..ఓట్లు లేని చోట నుంచి మహానాడా?!

సీట్లు..ఓట్లు లేని చోట నుంచి మహానాడా?!
X

తెలుగుదేశం పార్టీ గత ఏడాది కూడా మహానాడు నిర్వహించలేదు. ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలిసి..తెలివిగా మహానాడును స్కిప్ చేశారు. ఇప్పుడు కరోనా కారణంగా రాజకీయ సభలు, సమావేశాలకు అనుమతి లేదు. అందుకే ఈ సారి మహానాడు కాస్త ‘జూమ్ మహానాడు’గా మారింది. పది వేల మందితో జూమ్ మహానాడు..ఇది ఓ రికార్డు అంటూ కొన్ని పత్రికల్లో హోరెత్తిస్తున్నారు. అయితే తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లు గత కొన్ని నెలలుగా హైదరాబాద్ లోనే మకాం వేశారు. లాక్ డౌన్ కూడా ఈ మే 31తో ముగియనుంది. రైళ్ళు..విమానాల సేవలు కూడా ప్రారంభం అవుతున్నాయి. ఈ దశలో చంద్రబాబునాయుడు, నారా లోకేష్ లు అసలు ఏ మాత్రం సీట్లు, ఓట్లు లేని తెలంగాణలో కూర్చుని..23 సీట్లు, 40 శాతం ఓట్లు వచ్చిన ఏపీ నుంచి కాకుండా హైదరాబాద్ నుంచి మహానాడు నిర్వహించటం ఏమిటన్న విమర్శలు టీడీపీ నేతల నుంచే విన్పిస్తున్నాయి.

ఎలాగూ ఉపన్యాసాలు చేసేది జూమ్ లోనే కాబట్టి అదేదో అమరావతిలోని కరకట్ట నివాసం నుంచే చేయవచ్చు కదా?. అలా కాకుండా ఏ మాత్రం ప్రాతినిధ్యం, పార్టీ ఉనికే లేని తెలంగాణలో కూర్చుని మహానాడు నిర్వహించటం సరికాదని కొంత మంది టీడీపీ నేతలు వాదిస్తున్నారు. మామూలుగా అయితే ప్రతి ఏటా ఒక్కో చోట సమావేశాలు నిర్వహిస్తారు. మామూలుగా మహానాడు ఎప్పటిలాగానే హంగామాతో నిర్వహించే వెసులుబాటు ఉంటే ఈ సారి తెలంగాణలో సమావేశం అన్నా పెద్దగా ఆక్షేపించాల్సి ఏమీ ఉండదని కానీ ఇంట్లో కూర్చుని నిర్వహించే జూమ్ మహానాడు హైదరాబాద్ నుంచి చేయటం సరికాదని ఓ సీనియర్ నేత వ్యాఖ్యానించారు. ఇది పార్టీ శ్రేణులకు సరైన సంకేతాలు పంపదని నేతలు అభిప్రాయపడుతున్నారు.

కారణాలు ఏమిటో కానీ చంద్రబాబు హైదరాబాద్ నుంచి అమరావతి వెళ్లటానికి ఎందుకో ఆసక్తిచూపటంలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అందుకే అత్యంత కీలకమైన మహానాడును కూడా హైదరాబాద్ నుంచే నిర్వహించటానికి రెడీ అయ్యారంటే దీని వెనక బలమైన కారణాలు ఉన్నాయని చెబుతున్నారు. ప్రతి ఏటా టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత నందమూరి తారకరామారావు పుట్టిన రోజు మే 28 సందర్భంగా టీడీపీ మహానాడు నిర్వహించటం ఆనవాయితీ అన్న సంగతి తెలిసిందే. మహానాడు అంటే సహజంగా రాజకీయ తీర్మానాలు ఉంటాయి. అలాంటిది హైదరాబాద్ నుంచి ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ తీర్మానాలు చేయటం వల్ల పార్టీ మరిన్ని విమర్శలు మూటకట్టుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఒకప్పడు తెలంగాణలో ఎంతో బలంగా టీడీపీ ఈ స్థితికి చేరుకోవటానికి చంద్రబాబు నిర్ణయాలే కారణం అని ఆ పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.

Next Story
Share it