Telugu Gateway
Andhra Pradesh

సరస్వతి పవరా..మజాకానా!

సరస్వతి పవరా..మజాకానా!
X

డైరక్టర్ లేఖ..నీటి కేటాయింపులు శాశ్వతం

ముందు ఐదేళ్లకు ఎందుకు ఇచ్చారు..మళ్ళీ ఎందుకు మార్చారు

సరస్వతి పవర్ అండ్ పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ కంపెనీ ఎవరిదో అందరికీ తెలుసు. రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవ అన్న సామెత తరహాలో ఈ కంపెనీకి చేసిన నీటి కేటాయింపుల జీవోలో మార్పులు శరవేగంగా జరిగిపోయాయి. పైకి ఆ కంపెనీ డైరక్టర్ ఓ లేఖ రాశారు..ప్రభుత్వం ఓకే అంది అన్న చందంగానే ఉంటుంది. కానీ లోలోపల చాలా జరుగుతాయి. సర్వసతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ డైరక్టర్ 2020 మార్చి 2న సర్కారుకు ఓ లేఖ రాశారు. అదేంటి అంటే తమ కంపెనీకి చేసిన నీటి కేటాయింపులను కేవలం దీర్ఘకాలికంగా కాకుండా ఐదేళ్లకు పరిమితం చేయటం వల్ల ప్రాజెక్టు వయబులిటి దెబ్బతింటుందని పేర్కొన్నారు. సిమెంట్ ప్లాంట్ తోపాటు క్యాప్టివ్ విద్యుత్ ప్లాంట్, టౌన్ షిప్ లో తాగునీటి అవసరాలు, గ్రీన్ బెల్ట్ వంటి అవసరాల కోసం నీరు కావాల్సి ఉంటుందని, వాణిజ్యపరంగా లాభదాయకం కావాలంటే దీర్ఘకాలిక కేటాయింపులు అవసరం అని పేర్కొన్నారు. పెట్టుబడితోపాటు తాము ఉపాధి అవకాశాలు కల్పించబోతున్నందున తొలుత జారీ చేసిన జీవోలో మార్పులు చేసి..సరిపడినంత కాలానికి నీటి కేటాయింపులు చేస్తూ జీవో జారీ చేయాలని డైరక్టర్ తన లేఖలో పేర్కొన్నారు.

కంపెనీ డైరక్టరే సరిపడినంత కాలానికి అన్నారు తప్ప..నిర్దేశిత సమయాన్ని ఎక్కడా ప్రస్తావించలేదు. కానీ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ మాత్రం ప్రాజెక్టు జీవితకాలానికి నీటి కేటాయింపులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. గుంటూరు జిల్లాలోని మాచవరం మండలంలోని చిన్నాయపాలెం, వేమవరం గ్రామాల్లో నెలకొల్పనున్న సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కు కృష్ణా నది నుంచి 0.0689 టీఎంసీ (2.19 క్యూసెక్కులు) ల నీరు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. వర్షాకాలంలో కృష్ణా నది నుంచి వరద వచ్చే సమయంలో ఈ నీటిని తీసుకుంటారని పేర్కొన్నారు. దీని కోసం వెయ్యి గ్యాలన్ల నీటికిగాను కంపెనీ 5.50 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. 2019 డిసెంబర్ 3న ఐదేళ్ళ కాలానికే ఇదే ఆదిత్యనాథ్ దాస్ జీవో జారీ చేశారు. మళ్లీ అంతలోనే కంపెనీ డైరక్టర్ లేఖ రాయటం...నీటి కేటాయింపులను శాశ్వతకాలంగా మార్చటం వెనక మతలబు ఏమిటి అన్నది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఈ కంపెనీలో వేణుగోపాల్ రాజు ఆదిరాజు, జగన్మోహన్ రెడ్డి జెల్లా, నల్ల రామ గంగిరెడ్డి డైరక్టర్లుగా ఉన్నారు.

Next Story
Share it