Telugu Gateway
Andhra Pradesh

‘జగన్నామ’ సంవత్సరం..ఏడాది పాలనపై ‘రివైండ్’

‘జగన్నామ’ సంవత్సరం..ఏడాది పాలనపై ‘రివైండ్’
X

‘ప్రత్యేక హోదా’ లేఖలతోనే సరి

విభజన చట్ట హామీలు తెచ్చుకోలేని నిస్సహాయత

ప్రభుత్వ పథకాలకు సొంత పేర్లతో విమర్శలు

ఏపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన వచ్చి ఏడాది పూర్తవుతోంది. మరి ప్రమాణ స్వీకార సమయంలో చెప్పినట్లు జగన్ ఏడాదిలోనే ‘మంచి సీఎం’ అన్పించుకున్నారా?. ఆయన ఏడాది పాలనా నిర్ణయాలపై ఓ సమీక్ష. జగన్ ఏడాది పాలనలో చెప్పుకోదగ్గ అంశాలు ఏమైనా ఉన్నాయా అంటే కొత్తగా కల్పించిన నాలుగు లక్షల ఉద్యోగాలు అత్యంత కీలకం. గ్రామ వాలంటీర్లు, గ్రామ సచివాలయ ఉద్యోగాలు రికార్డు స్థాయిలో భర్తీ చేశారు. గ్రామ వాలంటీర్లకు వేతనాలు చాలా తక్కువే అయినా వాళ్ల ఉపయోగం ‘కరోనా’ సమయంలో స్పష్టమైంది. ఇప్పటివరకూ గ్రామ వాలంటీర్ల వ్యవస్థలో చిన్న చిన్న పొరపాట్లు ఉన్నా అంతిమంగా ప్రయోజనమే ఎక్కువ ఉంది. ఏడాది కాలంలో 3.5 కోట్ల మందికి 40వేల కోట్ల రూపాయలకుపైగా సాయం అందజేశామని తాజాగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన ఏడాది సమీక్షలో స్వయంగా ప్రకటించారు.

అయితే పాలన అంటే సంక్షేమ పథకాలు, ప్రజాధనాన్ని పంచిపెట్టమేనా?. పాలన అంటే సంక్షేమేనా? అన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. అయితే తొలి ఏడాది జగన్ కేవలం సంక్షేమ పథం పట్టారే తప్ప..‘ఆస్తుల కల్పన..ప్రణాళికా వ్యయం’పై ఏ మాత్రం ఫోకస్ పెట్టలేదనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. జగన్ తన ఏడాది పాలనలో తన నవరత్నాల స్కీమ్ అమలునే టార్గెట్ చేశారు. రైతు భరోసా, అమ్మ ఒడి, ఆరోగ్యశ్రీ విస్తరణ, ఇళ్ళ పట్టాల పంపిణీ, పెన్షన్ల పెంపు, చేనేత, మత్సకారులు, ఆటో నడిపే వాళ్ళకు ఇలా స్కీమ్ లు పెట్టి నగదు పంపిణీ చేశారు. ఆదాయం తెచ్చుకునే మార్గాలకంటే అప్పులు తెచ్చుకునే ఈ స్కీమ్ లు అన్నీ అమలు చేస్తున్నారు. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తీసుకున్న తొలి నిర్ణయం నవరత్నాల ఫైలుపై సంతకం. ఆ తర్వాత హైదరాబాద్ లోని ఏపీకి చెందిన సచివాలయ భవనాలను తెలంగాణకు ఇవ్వటం. కనీసం జగన్ ఈ నిర్ణయం తీసుకునే సమయానికి ఏపీ కేబినెట్ కూడా ఏర్పాటు కాలేదు. ఖాళీగా ఉన్న భవనాలను ఇవ్వటం తప్పుకాకపోయినా..ఆస్తుల విభజన తేలటంతో పాటు ఎందులోనూ ఈ నిర్ణయం ఉపయోగపడలేదు. అంతే కాదు ఎల్వీ సుబ్రమణ్యాన్ని సీఎస్ పదవి నుంచి తప్పించటం అధికార వర్గాలను షాక్ కు గురిచేసింది. ఏపీలోని ప్రభుత్వ భవనాలకు కోట్లాది రూపాయల వ్యయంతో వైసీపీ జెండాను పోలిన రంగులు వేయించటం..కోర్టులతో ఆక్షింతలు ప్రభుత్వానికి పెద్ద మైనస్ గా మారాయి. అంతే కాదు అత్యంత కీలకమైన రైతు భరోసా విషయంలోనూ జగన్ సర్కారు మాట తప్పింది. స్వయంగా రైతులకు ఏటా 12500 రూపాయలు ఇస్తామని చెప్పి..కేంద్రం పీఎం కిసాన్ కింద ఇచ్చే నిధులను ఈ ఖాతాలో కలిపేయటమమే కాకుండా...చెప్పిన దానికంటే ఎక్కువ ఇస్తున్నామని రైతులను మభ్యపెడుతున్నారు.

వైసీపీ అధికారంలోకి వచ్చాక నూతన విధానం ఖరారు కోసం అంటూ కొన్ని నెలల పాటు ఇసుక సరఫరాను నిలిపేసి ఎంతో మందిని తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. ప్రతిపక్షంలో ఉండగా తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టుపై తీవ్ర విమర్శలు చేసిన జగన్ అధికారంలోకి వచ్చాక అదే ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో పాల్గొనటం ఒకెత్తు అయితే...తెలంగాణ సీఎం కెసీఆర్ చాలా మంచోడు అంటూ అసెంబ్లీ వేదికగా పొగిడి..ఇప్పుడు పోతిరెడ్డిపాడుకు అడ్డం పడుతున్నారని ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవటం. దాదాపు లక్ష కోట్లతో ఉమ్మడి ప్రాజెక్టుకు ప్లాన్ చేసి..మధ్యలోనే బ్రేక్ లు వేయటం. ప్రతి ఏటా జనవరిలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని ప్రకటించినా..అది అమల్లోకి రాలేదు. గతంలో ఎన్నడూలేని రీతిలో సలహాదారులను ఇబ్బడిముబ్బడిగా నియమించుకోవటంలో జగన్ ఓ కొత్త రికార్డు నెలకొల్పారనే చెప్పాలి. పట్టిసీమలో మెఘా అవినీతికి పాల్పడిందని ఆరోపించిన జగన్, పోలవరంలో మాత్రం ఇదే సంస్థకు సింగిల్ టెండర్ వచ్చినా పనులు అప్పగించారు. టెండర్లలో అవినీతి నిరోధానికి జ్యుడిషయల్ కమిషన్ అని ప్రకటించినా పలు శాఖల్లో మాత్రం అవినీతి ఆరోపణలు విన్పిస్తూనే ఉన్నాయి. తాను చంద్రబాబులా చేయనని..ఫిరాయింపులను ప్రోత్సహించనని చెప్పిన జగన్ 151 మంది ఎమ్మెల్యేలతో ఉండి కూడా తెలుగుదేశాన్ని రాజకీయంగా మరింత దెబ్బకొట్టాలనే లక్ష్యంతో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను తమ వైపు తిప్పుకుంటున్నారు.

ప్రత్యేక హోదా

గత ఎన్నికల్లో ముఖ్యంగా యువతను తన వైపు తిప్పుకునేందుకు జగన్ ఉపయోగించుకున్న ప్రధాన అస్త్రం ఈ అంశం. కానీ జగన్ తన తొలి ఏడాది కాలంలో ‘ప్రత్యేక హోదా’ అంశంపై కేంద్రానికి లేఖలు ఇవ్వటం తప్ప చేసిందేమీ లేదు. అంతే కాదు...గెలిచిన వెంటనే మోడీకి పూర్తి మెజారిటీ వచ్చింది కదా...అడగటం తప్ప ఏమి చేయగలం అని ప్రశ్నిస్తూ చేతులెత్తేశారు. కానీ ఎన్నికలకు ముందు మాత్రం మాకు 25 మంది ఎంపీలను ఇవ్వండి..హోదా తెచ్చి రాష్ట్రాన్ని పరిశ్రమల మయం చేస్తామని ప్రకటించారు. హోదా వస్తే పరిశ్రమలు వాటంతట అవే వస్తాయని ప్రకటించారు. ప్రజలు 22 మంది ఎంపీలను ఇచ్చినా ప్రత్యేక హోదా విషయంలో అడుగు ముందుకు పడలేదు.

కడప స్టీల్ ప్లాంట్

ప్రత్యేక హోదా సంగతి పక్కన పెడితే విభజన చట్టం ప్రకారం రావాల్సిన కడప స్టీల్ ప్లాంట్, మేజర్ పోర్టును కేంద్రంపై ఒత్తిడి చేసి సాధించుకోవాల్సింది పోయి ..మా నిధులతో మేమే కట్టుకుంటాం అంటూ జీవోలు ఇచ్చి కడప స్టీల్ కు శంకుస్థాపన చేశారు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో 20 వేల కోట్ల రూపాయలతో కడప స్టీల్ ప్లాంట్ పూర్తయ్యే పనేనా?. ఏ ప్రైవేట్ సంస్థ అయినా ఈ తరుణంలో పెట్టుబడి పెట్టడానికి ముందు వస్తుందా?. కడప స్టీల్ ప్లాంట్ కల సాకారం అవుతుందా?

భోగాపురం విమానాశ్రయం

చంద్రబాబు జమానాలో అప్పగించిన ప్రాజెక్టుల టెండర్లు అన్నీ రివర్స్ చేస్తామని..ఖజానాకు ఆదా చేస్తామని చెప్పిన జగన్ సర్కారు భోగాపురం విమానాశ్రయం విషయంలో మాత్రం తన నిర్ణయాన్ని తానే ‘రివర్స్’ తీసుకుంది. అసలు భోగాపురం టెండర్లే గోల్ మాల్ చేసి..జీఎంఆర్ కు కట్టబెట్టేందుకు ప్రణాళిక వేశారని ఆరోపించిన వైసీపీ పెద్దలు..అధికారంలోకి వచ్చాక చంద్రబాబు ఫైనల్ చేసిన లోపభూయిష్ట టెండర్ కు ఓకే చేయటం వెనక మతలబు ఏంటి?. ఆర్ధిక శాఖ అభ్యంతరాలు ఉన్నా జగన్ దీనికి ఎందుకు జై కొట్టారు అన్న దానిపై ఎవరూ మాట్లాడరు.

శేఖర్ రెడ్డి, టీటీడీ బోర్డు సభ్యుడు

జగన్ సీఎం అయిన తర్వాత అత్యంత తీవ్రంగా విమర్శలు ఎదుర్కొన్న అంశం ఏదైనా ఉంది అంటే తమిళనాడుకు చెందిన శేఖర్ రెడ్డికి టీటీడీ బోర్డులో ప్రత్యేక ఆహ్వానితుడిగా చోటు కల్పించటం. టీడీపీ హయాంలో టీటీడీ బోర్డు సభ్యుడిగా ఉన్నప్పుడు వైసీపీ ఆయనపై చేసిన విమర్శలు అన్నీ ఇన్నీ కావు. కానీ అధికారంలోకి వచ్చాక ఆ విమర్శలు అన్నీ మర్చిపోయి ‘ప్రత్యేక ఆహ్వానితుడి’గా రాజమార్గం వేసి పెట్టారు.

అమరావతి

జగన్ ఏడాది కాలంలో తీసుకున్న అతిపెద్ద వివాదస్పద నిర్ణయాల్లో రాజధాని మార్పు. పరిపాలనా వికేంద్రీకరణ పేరుతో విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, కర్నూలులో జ్యుడిషియల్ క్యాపిటల్, అమరావతిలో లెజిస్లేచర్ క్యాపిటిల్. ప్రతిపక్షంలో ఉన్న ఐదేళ్ళు ఎప్పుడూ కూడా తాము అధికారంలోకి వస్తే రాజధాని మారుస్తామని చెప్పకుండా అధికారంలోకి వచ్చాక మాత్రం ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాజధాని కోసమే 33 వేల ఎకరాల భూములు ఇచ్చిన రైతులు దీంతో ఆందోళన బాట పట్టారు. అమరావతి లెజిస్లేచర్ రాజధానిగా ఉంటుందని ప్రకటించారు.

ప్రభుత్వ పథకాలు ‘జగనన్న’ మయం

బహుశా ఉమ్మడి రాష్ట్రంలోనూ ఏ ముఖ్యమంత్రి చేయని సాహసం సీఎం జగన్మోహన్ రెడ్డి చేశారు. ఏడాది కాలంలోనే ఏకంగా ప్రభుత్వ నిధులతో నడిచే ఏడు స్కీమ్ లకు తన పేరు పెట్టుకున్నారు. జగనన్న అమ్మ ఒడి, జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన, జగనన్న గోరు ముద్ద, జగనన్న చేదోడు, జగనన్న విద్యాకానుక, జగనన్న భరోసా. ఏకంగా ప్రభుత్వ యాడ్స్ లో అయితే ఏకంగా ‘జగనన్న’ ప్రభుత్వం అనే చెప్పుకుంటున్నారు. ఇది ప్రచారంలో హైట్.

ఎన్డీటీవీకి కాంట్రాక్ట్

ఏపీలో ప్రభుత్వ స్కూళ్ళలో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకుని ఇఫ్పటికే జీవోలు జారీ చేసిన సర్కారు ఇదే అంశంపై సర్వే కోసం అంటూ ప్రముఖ ఇంగ్లీష్ ఛానల్ ‘ఎన్ డీటీవీ‘కి కాంట్రాక్ట్ ఇవ్వటం. సర్వేతోపాటు కొన్ని షార్ట్ ఫిల్మ్ లు తీస్తారని జీవోలో పేర్కొన్నారు. కానీ ఆ కాంట్రాక్ట్ మొత్తం ఎంత అనేది మాత్రం జీవోలో ఎక్కవ ప్రస్తావించకపోవటం విశేషం. తాము అన్నీ పారదర్శకంగా చేస్తామని చెప్పే సర్కారు ఈ విషయంలో ఎందుకు రహస్యంగా ఉంచింది అన్నది చర్చనీయాంశం.

కెసీఆర్ మోడల్

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా తెలంగాణ సీఎం కెసీఆర్ మోడల్ ఫాలో అవుతున్నారని సాక్ష్యాత్తూ ఆయన కేబినెట్ లోని మంత్రులే వ్యాఖ్యానిస్తున్నారు. జగన్ కూడా ఎప్పుడో తప్ప సచివాలయానికి హాజరు కావటం లేదు. సమీక్షలు..సమావేశాలు అన్నీ తాడేపల్లిలోని క్యాంప్ ఆఫీసులోనే. అంతే కాదు ఈ ఏడాది కాలంలో ఎమ్మెల్యేలకు జగన్ అందుబాిటులో ఉన్న సమయం చాలా తక్కువ అని ఆ పార్టీ నాయకులే చెబుతారు. ఎమ్మెల్యేలకే కాదు..మంత్రులు కూడా అంత ఈజీగా జగన్ దగ్గరకు వెళ్లలేని పరిస్థితి ఉందని ఓ సీనియర్ నేత వ్యాఖ్యానించారు. అసెంబ్లీ సమావేశాల సమయంలో తప్ప..ఎమ్మెల్యేలు జగన్ ను కలవటం అంత ఈజీగా సాధ్యం కాదని చెబుతున్నారు.

Next Story
Share it