Telugu Gateway
Andhra Pradesh

చట్టాలు చేయకుండా అడ్డుకుంటారు..కోర్టుల్లో కేసులు వేస్తారు

చట్టాలు చేయకుండా అడ్డుకుంటారు..కోర్టుల్లో కేసులు వేస్తారు
X

ఇంగ్లీష్ మీడియం పెడితే తెలుగును అవమానించినట్లా?

రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టే విషయంలో వెనకంజ వేసే ప్రశ్నేలేదని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ అంశంపై సుప్రీంకోర్టుకు కూడ వెళుతున్నామని..వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఆంగ్ల మాధ్యమం అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. విద్యారంగంలో మార్పుల్లో భాగంగానే ఇంగ్లిష్‌ మీడియాన్ని తీసుకొచ్చామని, ఇంగ్లిష్‌ మీడియాన్ని తీసుకొస్తే తెలుగును అగౌరవపరిచినట్లనే కొందరు పెద్ద మనుషులు విచిత్రమైన వాదనను తీసుకొస్తున్నారని విమర్శించారు. ఇంగ్లీష్‌ మీడియం వద్దనే పెద్దమనుషులు మాత్రం...తమ పిల్లల్ని ఇంగ్లిష్‌ మీడియంలోనే చదివిస్తున్నారు. అసెంబ్లీలో చట్టాలు చేయకుండా అడ్డుకుంటారు, కోర్టుల్లో కేసులు వేస్తారు. అయినా సడలని పట్టుదలతో ఇంగ్లిష్‌ మీడియంపై ఇంటింటి సర్వే చేశాం. దాదాపు 40 లక్షల మంది పిల్లల తల్లిదండ్రుల అభిప్రాయాలు తీసుకుంటే.. అందులో 96శాతం మంది ఇంగ్లిష్‌ మీడియం కావాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చబోతున్నాం. నాడు - నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల్లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయబోతున్నాం.

రాష్ట్రంలోని ప్రతి పాఠశాలల్లోనూ ఫర్నీచర్‌, టాయిలెట్లు ఉండాలి. పిల్లల చదువులు తల్లిదండ్రులకు భారం కాకూడదనే అమ్మఒడి తీసుకొచ్చాం. 80 లక్షల మంది పిల్లలకు లాభం చేకూరేలా ఈ జనవరిలో అమ్మఒడి ప్రారంభించాం. 43 లక్షల మంది తల్లులకు రూ.6350 కోట్లను నేరుగా బ్యాంక్‌ అకౌంట్లలో జమ చేశాం. బుధవారం నాడు మన పాలన-మీ సూచన కార్యక్రమంలో భాగంగా విద్యారంగంపై తాడేపల్లిలోని క్యాంపు ఆఫీస్‌లో సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఈ పోటీ ప్రపంచంలో మనం పిల్లలకు ఇచ్చే ఏకైక ఆస్తి చదువు మాత్రమే. అమ్మఒడి, విద్యాదీవెన, వసతి దీవెన పథకాలపై.. ఇంత డబ్బు ఎందుకు ఖర్చు పెడుతున్నారని నన్ను అడుగుతున్నారు. వారికి నేను చెప్పే సమాధానం ఒక్కటే.. మన పిల్లల భవిష్యత్‌ కోసం ఇది నేను పెడుతున్న పెట్టుబడి అని వ్యాఖ్యానించారు. కొత్త మార్పులు చేసేటప్పుడు మొదట్లో కొన్ని సమస్యలు తలెత్తుతాయి. ఇంగ్లిష్‌ మీడియానికి సంబంధించి కూడా చిన్న, చిన్న సమస్యలు ఎదురయ్యాయి. వీటిని అధిగమించడానికి ఆంగ్ల బోధనకు సంబంధించి టీచర్లకు శిక్షణ ఇస్తున్నాం. పేదవాళ్ల పిల్లలు ఇంగ్లిష్‌లో మాట్లాడే పరిస్థితి రావాలి. కోవిడ్‌ కారణంగా ఆగస్టు 3 నుంచి పాఠశాలలు తెరుస్తున్నాం. పాఠశాలలు తెరిచిన తొలిరోజే జగనన్న విద్యాకానుక ఇస్తామని తెలిపారు.

Next Story
Share it