ఎల్ జీ దుర్ఘటన ..ఒక్కో కుటుంబానికి కోటి పరిహారం

సంఘటనపై విచారణకు అధికారుల కమిటీ
అవసరం అయితే కంపెనీని తరలిస్తాం
ఎల్ జీ బహుళ జాతి సంస్థ..పేరున్న కంపెనీ
సీఎం జగన్మోహన్ రెడ్డి
ఎల్ జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ప్రమాదంలో మరణించిన వ్యక్తులకు సంబంధించి ఒక్కో కుటుంబానికి కోటి రూపాయల నష్టపరిహారం ఇస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. ఈ ఘటనలో తొమ్మిది మంది మరణించినట్లు సీఎం ప్రకటించారు. ఘటన విషయం తెలిసిన వెంటనే తాడేపల్లి నుంచి విశాఖపట్నం చేరుకున్న జగన్ తొలుత కెజీహెచ్ ఆస్పత్రిలో బాధితులను పరామర్శించారు. తర్వాత ఉన్నతాధికారులతో సమావేశం అనంతరం మాట్లాడుతూ జగన్ కీలక ప్రకటనలు చేశారు. అందులోని ముఖ్యాంశాలు. ‘ ఎల్ జీ చాలా రెప్యుటెడ్ కంపెనీ. అలాంటి కంపెనీలో ఇలా జరగటం బాధాకరం. లోతుగా అధ్యయనం చేసి రిపోర్ట్ ఇవ్వాల్సిందిగా ఒక కమటీని ఏర్పాటు చేస్తున్నాం. స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్ మెంట్, సెక్రటరీ ఇండస్ట్రీస్. సెక్రటరీ పీసీబీ, కలెక్టర్, కమిషనర్ ఆఫ్ పోలీసు. వీరంతా కూడా కమిటీలో సభ్యులుగా ఉండి లోతుగా అధ్యయనం చేసి అసలు ఏమి జరిగింది. ఇలాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా ఏమి చేయాలో నివేదిక ఇస్తారు.
ఆ కంపెనీ గురించి ఏమి చేయాలో నిర్ణయం తీసుకోవటం జరుగుతుంది. సంఘటన తెల్లవారు జామున జరిగినప్పటికీ కూడా అలారమ్ మోగాలి కదా?. నా మనసున కలచి వేస్తున్న ప్రశ్న ఇది. లోతైన అధ్యయనం చేసిన తర్వాత ..ఏమి యాక్షన్ తీసుకోవాలి అనేది నిర్ణయం తీసుకుంటాం. సంఘటన జరిగిన వెంటనే అంబులెన్స్ లు అందుబాటులోకి రావటం, కలెక్టర్ సకాలంలో చేరుకున్నారు, పోలీసులు సరిగానే స్పందించారు. అధికారులను అభినందించాల్సిన అంశం. చాలా బాగా స్పందించారు. 348 మందిని అన్ని హాస్పిటల్స్ లో చేర్పించారు. చాలా మంది వచ్చినప్పుడు స్పృహ లేని స్థితిలో ఉన్న వారు కూడా ఇప్పుడు వెంటిలేటర్ అవసరం లేకుండా రికవరి అయ్యారు. చనిపోయిన వ్యక్తులకు సంబంధించిన తొమ్మిది కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా. మనుషులను వెనక్కి తీసుకురాలేక పోయినా ఆ కుటుంబాలకు అన్ని రకాలుగా తోడుగా ఉంటానని మాత్రం ఖచ్చితంగా హామీ ఇస్తున్నాను. వీళ్లకు సంబంధించి చనిపోయిన ప్రతి కుటుంబానికి కంపెనీ వాళ్ళతో ఏ మేరకు రాబడతామో చూస్తాం. కంపెనీ ఇచ్చినా..ఇవ్వకపోయినా ప్రభుత్వం ముందుండి ఆదుకుంటుంది. చనిపోయిన ప్రతి కుటుంబానికి కోటి రూపాయల నష్టపరిహారం అందిస్తాం. కంపెనీతో ఏమి మాట్లాడుకోవాలో ప్రభుత్వం మాట్లాడుకుంటుంది. ఆస్పత్రిలో వైద్యం చేయించుకుంటున్న వారికి ..ప్రైమరీ కేర్ వైద్యం వాళ్ళకు కూడా 25 వేలు ఇవ్వటం జరుగుతుంది. ఆస్పత్రి పాలై..రెండు మూడు రోజులు ఉండాల్సిన వారికి లక్ష రూపాయలు నష్టపరిహారం ఇస్తాం.
వెంటిలేటర్ సాయం తో వైద్యం చేయించుకునే పరిస్థితి వచ్చిన వారికి పది లక్షల రూపాయల నష్టపరిహారం ఇస్తాం. ఏ ఒక్కరికీ కూడా వైద్యం ఖర్చు రూపాయ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. వాళ్లంతా సంతోషంగా ఇళ్ళకుపోయేలా చేయాలని ఆదేశాలు ఇస్తున్నాం. ఈ లీకేజ్ వల్ల ఎన్ని ఊళ్ళు ఎఫెక్ట్ అయ్యాయి. ఈ స్ట్రెస్ వాళ్ళ మీద ఉంటుంది. వీళ్లందరికీ స్ట్రెస్ కు లోనూ భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదు..ప్రభుత్వం తోడుగా..నీడగా ఉంటుంది. 15 వేల మంది ఈ గ్రామాల్లో ఉంటారు. వీళ్లందరికీ 10 వేల రూపాయల ఆర్ధిక సహాయం చేయమని చెప్పి కలెక్టర్ ఆదేశాలు జారీ చేశాం. ఆ గ్రామాల్లో మెడికల్స్ క్యాంప్స్ పెట్టమని కోరాం. సీఎస్ ను నెక్ట్స్ రెండు రోజులు ఇక్కడే ఉండి.. ఈ మిషన్ మీద ఉండమని రిక్వెస్ట్ చేస్తున్నా. కన్నబాబు ఇన్ ఛార్జి మంత్రి. తాను ఇక్కడే ఉంటాడు. బొత్స సత్యానారాయణ, అవంతి శ్రీనివాస్ ఈ ప్రాంతం వాళ్లు. ఇక్కడే ఉండి చూస్తారు. ఈ గ్రామాల్లో కొన్ని జంతువులు కూడా చనిపోయాయని చెప్పారు. వంద శాతం నష్టపరిహారం చెల్లిస్తాం. ఎల్ జీ పెద్ద సంస్థ. బహుళ జాతి కంపెనీ. కంపెనీ అక్కడ నుంచి షిఫ్ట్ చేయాల్సి వస్తే..ఖచ్చితంగా చేస్తాం. ఆ కుటుంబాలకు చెందిన వ్యక్తులకు ఎల్ జీ ఉద్యోగాలు ఇప్పించే ప్రయత్నం కూడా చేస్తాం. మంచి మనిషిగా చేయగలిగినంత చేస్తాం. ఈ అందులో ప్రభుత్వం ముందు ఉంటుంది.’ అని జగన్ ప్రకటించారు.