Telugu Gateway
Andhra Pradesh

సర్కారు తీరు కోర్టు ధిక్కారమే

సర్కారు తీరు కోర్టు ధిక్కారమే
X

ఏపీ ఎస్ఈసీ విషయంలో హైకోర్టు తీర్పు అనంతరం కూడా ఈ వ్యవహారం మరింత వేడెక్కుతోంది. హైకోర్టు తీర్పుపై తాము సుప్రీంకు అప్పీల్ కు వెళుతున్నామని..హైకోర్టు తీర్పు ప్రకారం అసలు రమేష్ కుమార్ నియామకం కూడా చెల్లుబాటు కాదని ఏపీ అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ ప్రకటించారు. అంతే కాదు నిమ్మగడ్డ రమేష్ కుమార్ తనంతట తాను బాధ్యతలు స్వీకరించినట్లు ప్రకటించటం కూడా చెల్లుబాటు కాదని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై ఎస్ఈసీ రమేష్ కుమార్ స్పందించారు. హైకోర్టు తీర్పును, ఆదేశాలను ప్రభుత్వం ఉల్లంఘిస్తోందని నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆయన ఆదివారం నాడు ఓ ప్రకటన విడుడల చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ స్వయం ప్రతిపత్తి, సమగ్రతను దెబ్బతీసేలా సర్కారు తీరు ఉందన్నారు. హైకోర్టు తీర్పును రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకపోవడంపై.. తిరిగి హైకోర్టును ఆశ్రయించాలని నిమ్మగడ్డ నిర్ణయించుకున్నారు. కోర్టు ధిక్కారం కింద పిటిషన్‌ వేయాలనే యోచనలో ఉన్నారు. తాను ఛార్జ్‌ తీసుకున్నట్లు ప్రకటించిన తర్వాత కూడా.. ఉత్తర్వులను ఉపసంహరించుకున్న విషయాన్ని ప్రస్తావించారు. రాష్ట్ర హైకోర్టు తన తీర్పులో ఆర్డినెన్స్‌ ను, ప్రభుత్వం విడుదల చేసిన జీవోలను కొట్టివేసిందన్నారు. జస్టిస్‌ కనగరాజ్‌ నియామకాన్ని హైకోర్టు రద్దు చేసిందన్నారు.

తీర్పు 308 నెంబర్‌ పేరాలో ఎస్‌ఈసీగా తనను కొనసాగించే పరిస్థితిని పునరుద్ధరించాలని హైకోర్టు పేర్కొందన్నారు. తన పదవీకాలం పూర్తయ్యే వరకు, అంటే 2021 మార్చి 31వ తేదీ వరకు తనను ఆ పదవిలో కొనసాగించాలని ఆదేశించిందన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా కొనసాగే తన హక్కును రాష్ట్ర హైకోర్టు స్పష్టం చేసిందన్నారు. తీర్పులోని అంశాల దృష్ట్యా ఎస్‌ఈసీ పదవి ఖాళీగా ఉండకూడదన్నారు. తనను ప్రభుత్వం తొలగించలేదని స్పష్టం చేశారు. ఆర్డినెన్స్‌ తీసుకురావడం ద్వారా వేరేవారిని నియమించారన్నారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో తనను ఎన్నికల కమిషనర్‌గా కొనసాగాలని.. పాత పరిస్థితిని పునరుద్ధరించాలని తీర్పులో పేర్కొన్న విషయాన్ని గుర్తు చేశారు. ఈ తీర్పు ప్రకారమే తాను ఛార్జ్‌ తీసుకున్నట్లు సమాచారం ఇచ్చానని తెలిపారు. ఇదే అంశాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కార్యదర్శి కూడా సర్క్యులర్‌ ద్వారా నోటిఫై చేశారన్నారు. అటు ప్రభుత్వం, ఇటు రమేష్ కుమార్ ఎవరి వాదనలు వారు విన్పిస్తున్నారు. మళ్ళీ కోర్టులు జోక్యం చేసుకుని క్లారిటీ ఇస్తే తప్ప..ఈ విషయం ఇప్పట్లో తేలేలా లేదు.

Next Story
Share it