Telugu Gateway
Telangana

తెలంగాణలో కరోనా టెస్ట్ లు ఇంత తక్కువా?

తెలంగాణలో కరోనా టెస్ట్ లు ఇంత తక్కువా?
X

తెలంగాణలో కరోనా పరీక్షలు సాగుతున్న తీరుపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. రాష్ట్రంలో కరోనా పరీక్షలపై దాఖలపై పిటిషన్లపై హైకోర్టు మంగళవారం నాడు విచారించింది. మృతదేహాలకు కరోనా పరీక్షలు అవసరం లేదన్న ప్రభుత్వ ఉత్తర్వులను కొట్టివేసింది. లక్షణాలు లేని హైరిస్క్ ఉన్న వారికి ఎందుకు పరీక్షలు చేయడం లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. మిగతా రాష్ట్రాలతో పోల్చితే ఎందుకు తక్కువ పరీక్షలు చేస్తున్నారని ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నించింది. రాష్ట్రంలో మార్చి 11 నుంచి ఇప్పటి వరకు చేసిన కరోనా పరీక్షల వివరాలను సమర్పించాలని హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసింది.

అంతేకాదు పీపీఈ కిట్లను ఎంత మంది వైద్య సిబ్బందికి ఇచ్చారో చెప్పాలని సూచించింది. కరోనా పరీక్షలపై కేంద్ర ప్రభుత్వం రాసిన రెండు లేఖలను కూడా అందజేయాలని స్పష్టం చేసింది. జూన్ 4 లోగా పూర్తి నివేదిక అందజేయాలని ఆదేశించింది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి ప్రీతిసూడాన్ ఈ నెలలోనే తెలంగాణ సీఎస్ కు కరోనా టెస్ట్ లపై లేఖ రాశారు. కరోనాను నియంత్రించేందుకు పెద్ద ఎత్తున టెస్ట్ లు చేయాలని..రాష్ట్రంలోని ల్యాబ్ లను కూడా సరిగా వాడుకోవటంలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ తరుణంలో హైకోర్టు వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

Next Story
Share it