Telugu Gateway
Andhra Pradesh

ఏపీలో మద్యం రేట్లు 75 శాతం పెంచమని కేంద్రం చెప్పిందా?

ఏపీలో మద్యం రేట్లు 75 శాతం పెంచమని కేంద్రం చెప్పిందా?
X

దేశంలో బ్రాందీ షాప్ లు ఓపెన్ చేయమన్నది ప్రధాని మోడీ, కేంద్రమే కదా? అంటూ ఏపీ మంత్రులు, వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై బిజెపి మండిపడింది. రాష్ట్రంలో 75 శాతం రేట్లు పెంచమని కేంద్రం చెప్పిందా అని ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, ఎంపీ జీవీఎల్ నరసింహరావు ప్రశ్నించారు. మద్యం షాపుల ఓపెన్ చేయటం విషయంలో అంత ఆగమేఘాల మీద స్పందించాల్సిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు. పక్కనే ఉన్న తమిళనాడులో ఓపెన్ చేయలేదు..కేరళ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మీరు నిర్ణయం తీసుకుని దానికి కేంద్రాన్ని బాధ్యులు చేస్తారా? అని జీవీఎల్ ప్రశ్నించారు. పలువురు ముఖ్యమంత్రులు మద్యం షాపులకు అనుమతి ఇవ్వాలని కోరారని..అందుకు అనుగుణంగానే కేంద్రం నిర్ణయం తీసుకుందని చెప్పారు.

మద్యం విక్రయాలపై నిర్ణయాధికారం రాష్ట్ర ప్రభుత్వాలదే అని..దాని ద్వారా వచ్చే ఆదాయం కూడా పూర్తిగా వారికే వెళుతుందని చెప్పారు. మద్యం విషయంలో వైసీపీ, టీడీపీలు రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. మద్యనిషేధం అని చెప్పిన వైసీపీ ఈ సదవకాశాన్ని ఎందుకు వాడుకోలేకపోయిందని ప్రశ్నించారు. చంద్రబాబు హయాంలోనూ మద్యం అమ్మకాలు విచ్చలవిడిగా సాగాయని జీవీఎల్ విమర్శించారు. ఇప్పుడు ఆ పార్టీలు కేంద్రంపై వ్యాఖ్యలు చేయటం సరికాదన్నారు. కేంద్రంపై వైసీపీ నేతల వ్యాఖ్యలు సరికాదన్నారు.

Next Story
Share it