Telugu Gateway
Andhra Pradesh

జగన్...విజయసాయిరెడ్డిల మధ్య ఆనాటి బంధాలేవీ?

జగన్...విజయసాయిరెడ్డిల మధ్య ఆనాటి బంధాలేవీ?
X

ఏడాది ఉత్సవాల్లో ఎక్కడ కన్పించని విజయసాయిరెడ్డి!

దూరం పెట్టారంటున్న పార్టీ వర్గాలు

అది 2019 మే 23. ఏపీలో ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. వైసీపీ అప్రతిహత విజయాన్ని దక్కించుకుంది. ఆ సమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కౌగిలించుకుని ఆనందాన్ని పంచుకున్న ఏకైక వ్యక్తి ఎంపీ విజయసాయిరెడ్డి. మిగిలిన వారందరూ జగన్ కు అభినందనలు చెప్పారే కానీ..విజయసాయిరెడ్డిలా కౌగిలించుకుని ఆనందాన్ని పంచుకునే సాన్నిహిత్యం ఇతరులకు లేదనే చెప్పొచ్చు. కానీ ఏడాదిలో సీన్ రివర్స్ అయిందా?. అంటే ఔననే చెబుతున్నాయి పార్టీ వర్గాలు. గత కొన్ని రోజులుగా సీఎం జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో వివిధ రంగాలకు సంబంధించిన అంశాలపై సమావేశాలు పెట్టారు. ఆ సమావేశాల్లో కూడా ఎక్కడా వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత, ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధి అయిన విజయసాయిరెడ్డి కన్పించలేదు.

ప్రభుత్వంలో ఇప్పటివరకూ రెండవ స్థానంలో ఉన్న వ్యక్తి ఎందుకు దూరం దూరంగా ఉంటున్నారు అన్నది చర్చనీయాంశంగా మారింది. మరో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితోపాటు ఇతర కీలక నేతలు అందరూ కన్పిస్తూనే ఉన్నారు. సరే..ఆ సమావేశాలకు విజయసాయిరెడ్డి ఎందుకు వస్తారు అనుకుందాం కాసేపు. వైసీపీ అధికారంలోకి వచ్చి..సీఎంగా జగన్ బాధ్యతుల చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా నిర్వహించిన వార్షికోత్సవ ఉత్సవాల్లో కూడా ఎక్కడా విజయసాయిరెడ్డి కన్పించకపోవటం పార్టీలో కలకలం రేపుతోంది. అటు తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో కానీ..రాష్ట్ర వ్యాప్తంగా సీఎం జగన్ ప్రారంభించిన రైతు భరోసా కేంద్రాల కార్యక్రమంలో కూడా విజయసాయిరెడ్డి లేరు. విజయసాయిరెడ్డి శుక్రవారం సాయంత్రమే విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే అత్యంత కీలకమైన ఘట్టంలో విజయసాయిరెడ్డి లేకుండా ఉండటం అంటే ఆషామాషీ వ్యవహారం ఏమీ కాదు. విశాఖపట్నంలో ఎల్ జీ పాలిమర్స్ ఘటన జరిగినప్పటి నుంచి విజయసాయిరెడ్డిని జగన్ దూరం పెట్టారనే ప్రచారం పార్టీలో మొదలైంది.

సీఎం జగన్ విశాఖపట్నం వెళ్ళే సమయంలో ఎక్కిన కారును కూడా జగన్ దించేసి..ఉప ముఖ్యమంత్రి ఆళ్ళ నాని ని ఎక్కించుకుని వెళ్లారు. అప్పట్లో విజయసాయిరెడ్డి మద్దతు దారులు మాత్రం హెలికాప్టర్ లో చోటులేదని..ఆరోగ్య శాఖ మంత్రి కాబట్టి బాధితులను పరామర్శించటానికి వెళుతున్నందున ఆళ్ళ నానిని తీసుకెళ్ళారని సమర్ధించుకునే ప్రయత్నం చేశారు. మరి జగన్ సీఎం అయి ఏడాది పూర్తయిన కీలక ఘట్టంలో తాడేపల్లిలో ఉండి సీఎంకు అభినందనలు కూడా తెలియజేయకుండా హైదరాబాద్ లో ఉన్నారంటే జగన్, విజయసాయిరెడ్డిల మధ్య ‘గ్యాప్’ బాగా పెరిగిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అంతే కాదు నిత్యం ట్విట్టర్ వేదికగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, ఎమ్మెల్సీ లోకేష్ లపై విమర్శలు చేసే విజయసాయిరెడ్డి కనీసం ట్విట్టర్ లో కూడా ఏడాది కాలం పూర్తి చేసుకున్న సీఎం జగన్ కు, ప్రభుత్వానికి కనీసం అభినందనలు కూడా (ఈ వార్త రాసే శనివారం మధ్యాహ్నాం రెండు గంటల వరకూ) తెలియజేయకపోవటం విశేషం. కానీ అదే ట్విట్టర్ వేదికగా ఆయన మాత్రం చంద్రబాబుపై మాత్రం సెటైర్లు వేస్తూనే ఉన్నారు.

Next Story
Share it