Telugu Gateway
Andhra Pradesh

మద్యం షాపుల దగ్గర టీచర్లా?

మద్యం షాపుల దగ్గర టీచర్లా?
X

ఏపీ సర్కారు తీనును ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు తప్పుపట్టారు. మద్యం షాపుల వద్ద పిల్లలకు పాఠాలు చెప్పే టీచర్లను ఎలా పెడతారని ప్రశ్నించారు. దక్షిణాదిలో ఎక్కడా మద్యం షాపులు తీయకపోయినా ఏపీలో మాత్రం విచ్చలవిడిగా షాపులు తీశారన్నారు. చంద్రబాబు మంగళవారం నాడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మీడియా సమావేశంలో మాట్లాడారు. మద్యం కోసం వైన్ షాపుల వద్దకు వెళ్లొద్దని చంద్రబాబు కోరారు. సోమవారం నాడు లిక్కర్ షాపుల వద్ద పరిస్థితి చూశాక తీవ్ర ఆవేదన కలిగిందన్నారు. అందరికీ మాస్కులు ఇస్తానన్న ప్రభుత్వం.. కనీసం రెడ్‌జోన్‌ల్లోనూ మాస్కులు ఇవ్వలేకపోయిందని ప్రభుత్వ తీరుపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిత్యావసరాల కోసం 3 గంటల సమయం ఇచ్చిన ప్రభుత్వం.. మద్యం కోసం 8 గంటల సమయం ఎలా ఇస్తుందని ఆయన ప్రశ్నించారు. మెడికల్ షాప్‌కి వెళ్తే ప్రజలను కొట్టిన ప్రభుత్వం.. మద్యం షాప్‌కి మాత్రం స్వాగతిస్తుందని విమర్శించారు.

ధరలు పెంచడం వల్ల మద్యపాన నిషేధం ఎక్కడైనా జరిగిందా? అని చంద్రబాబు ప్రశ్నించారు. ముఖ్యమంత్రి జగన్‌వి కుర్ర చేష్టలని ధ్వజమెత్తారు. క్వారంటైన్ సెంటర్ల వద్ద టెస్టులు చేశారా? అని ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు. కర్నూలులో కరోనా వ్యాప్తిని ఎందుకు కంట్రోల్ చేయలేకపోయారని ప్రశ్నించారు. కేంద్రం చెబితేనే తెరిచామంటూ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. ఏపీకి తాను వస్తే క్వారంటైన్‌లో పెడతామంటున్న వైసీపీ నేతలు.. వారు మాత్రం యధేచ్చగా లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు. తాను ఏపీకి వస్తే క్వారంటైన్‌లో ఉంటానని అన్నారు.

Next Story
Share it