ఎల్ జీ పరిశ్రమను అక్కడ నుంచి తరలించాలి

విశాఖపట్నంలో ప్రమాదానికి కారణమైన ఎల్ జి పాలిమర్స్ కంపెనీని అక్కడ నుంచి వేరే ప్రాంతానికి తరలించాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు డిమాండ్ చేశారు. జనావాసాల మధ్య ఇలాంటి పరిశ్రమలు ఉండటం మాత్రం సరికాదన్నారు. పరిశ్రమలకు అనుమతి ఇఛ్చేటప్పుడు నిబంధనలను పాటించాలని సూచించారు. తక్షణమే ఈ పరిశ్రమను మూసివేయాలన్నారు. గ్యాస్ లీక్ ప్రమాదంపై సీఎం జగన్ ప్రకటన ఏ మాత్రం సరికాదని వ్యాఖ్యానించారు. సీఎం మాటలు చూసిన తర్వాత ఇలాంటి ఘటనలు అందరూ తేలిగ్గా తీసుకునే ప్రమాదం ఉందని అన్నారు. చంద్రబాబు శుక్రవారం నాడు హైదరాబాద్ లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మీడియాతో మాట్లాడారు. కోటి రూపాయలు ఇస్తే ప్రాణాలు తిరిగొస్తాయా? అని ప్రశ్నించారు. తాను ముఖ్యమంత్రిగా ఉండి ఉంటే నేరుగా ప్రమాదానికి కారణమైన పరిశ్రమ వద్దకే వెళ్లే వాడినని తెలిపారు. అవగాహనారాహిత్యం వల్ల ప్రమాదాన్ని తేలిగ్గా తీసుకున్నారని సీఎం జగన్ తీరుపై విమర్శలు చేశారు.
టీడీపీ తరఫున చినరాజప్ప, అచ్చెన్నాయడు, రామానాయుడులతో కూడిన త్రిసభ్య కమిటీ ప్రమాదం జరిగిన ప్రాంతంలో పర్యటించి వాస్తవాలు అధ్యయనం చేస్తుందన్నారు. లాక్‌డౌన్ వల్లే ప్రమాదం జరిగిందా అనే కోణంలోనూ అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ తప్పిదాలు అనేకం ఉన్నాయన్నారు. కరోనా అంశాన్ని తేలిగ్గా తీసుకోవటం వల్లే ఇప్పుడు రాష్ట్రంలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ప్రజల ఆరోగ్యమే ముఖ్యమనే విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలన్నారు. వివాఖ పర్యటన కోసం కేంద్రాన్ని అనుమతి కోరానని...అది రాగానే వెళ్ళి బాధితులను పరామర్శిస్తానని తెలిపారు.