ఏపీలో మద్యం ధరలు మరో 50 శాతం పెంపు

మద్యం విషయంలో ఏపీ సర్కారు చాలా దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటోంది. తాము మేనిఫెస్టోలో ప్రకటించినట్లు మద్య నియంత్రణ కోసమే రేట్లు పెంచుతున్నామని అంటూ తొలుత 25 శాతం మేర రేట్లు పెంచారు. 25 శాతం మేర రేట్లు పెంచినా కూడా మద్యం షాపులు ఓపెన్ చేయగానే కిలోమీటర్ల కొద్దీ క్యూలతో మందు షాపులు కళకళలాడాయి. ఏకంగా ఒక్క రోజే 60 కోట్ల రూపాయల మేర అమ్మకాలు జరిగినట్లు అంచనా. మంగళవారం నాడు సర్కారు మరో సంచలన నిర్ణయం తీసుకుంది. కొత్తగా మరో 50 శాతం మేర రేట్లు పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది.
దీని కోసం షాపులు తెరిచే సమయం కూడా ఓ గంట ఆలశ్యం చేశారు. దీంతో రెండు రెండు రోజుల్లోనే ఏపీలో మద్యం ధరలు మొత్తం మీద 75 శాతం మేర పెరిగినట్లు అయింది. సోమవారం నాటి క్యూలను పరిశీలించి...మద్యపానాన్ని నిరుత్సాహపరిచే దిశగానే ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుందని అధికారులు చెబుతున్నారు. పెంచిన ధరలు కూడా సత్వరమే అమల్లోకి వస్తాయని ప్రకటించారు. ఇదిలా ఉంటే ఈ నెలాఖరులోగా మరో 15శాతం మద్యం దుకాణాల తగ్గింపు దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.