Telugu Gateway
Andhra Pradesh

ఏపీ రైతు భరోసా యాడ్స్ లో ‘మోడీ మాయం’!

ఏపీ రైతు భరోసా యాడ్స్ లో ‘మోడీ మాయం’!
X

కేంద్రం నిధులు వాడుకుంటూ ప్రధాని ఫోటో కూడా వేయం వైనం

‘మేం పని చేస్తాం. అసలు ప్రచారం చేసుకోం. ఇదీ వైసీపీ మంత్రుల దగ్గర నుంచి ఆ పార్టీ నేతలు పదే పదే చెబుతున్న మాట. కానీ వాస్తవం మాత్రం అందుకు భిన్నంగా ఉంది. వైసీపీ ఎన్నికలకు ముందు...ఆ పార్టీ ప్లీనరీలోనే తాము అధికారంలోకి వస్తే రైతులకు ప్రతి ఏటా 12500 రూపాయలు ఇస్తామని ప్రకటించింది. కానీ అధికారంలోకి వచ్చాక కేంద్రం ప్రకటించిన పీఎం కిసాన్ యోజన నిధులను కూడా ఇందులో కలిపేసి రైతులకు సాయం అందజేస్తున్నారు. అసలు వైసీపీ స్కీమ్ ప్రకటించే నాటికి పీఎం కిసాన్ పథకమే లేదు. శుక్రవారం నాడు వైఎస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్ స్కీమ్ కింద మరో విడత రైతుల ఖాతాల్లోకి 2800 కోట్ల రూపాయలు జమ చేశారు. ఒక్కో రైతు ఖాతాలో 5500 రూపాయలు వేశారు. అంత వరకూ బాగానే ఉంది. ఓ వైపు పీఎం కిసాన్ నిధులను వాడుకుంటూ ఏపీ సర్కారు సొంత ప్రచారం చేసుకుంటోంది.

శుక్రవారం నాడు పత్రికల్లో ఇచ్చిన యాడ్స్ లో దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డితోపాటు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫోటోలు వేశారు కానీ...కేంద్రం నిధులు వాడుకుంటూ ప్రధాని నరేంద్రమోడీ ఫోటోను మాత్రం ఈ యాడ్స్ లో పెట్టలేదు. యాడ్ లో మాత్రం ‘వైఎస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్’ అంటూ మోడీ ఫోటో పెట్టకపోవటంపై ఏపీ బిజెపి శ్రేణులు గుర్రుగా ఉన్నాయి. తాము అసలు ప్రచారానికే దూరం అన్నట్లు మాట్లాడే నేతలు పథకం అమల్లో సహకరిస్తున్న కేంద్రాన్ని కూడా విస్మరిస్తున్నారు. ఏపీలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ప్రభుత్వం అంటే సీఎం ఒక్కరు మాత్రమే ...మంత్రులను పట్టించుకోవాల్సిన అవసరమే లేదన్నట్లు పేజీలకు పేజీలు ఇఛ్చే యాడ్స్ లో ఒక్క మంత్రి ఫోటోను కూడా వేయటం లేదు. ఈ అంశంపై ప్రశ్నించే సాహసం ఏ మంత్రి చేయలేరనే విషయం తెలిసిందే. టీడీపీ అధికారంలో ఉండగా..కేంద్రం ఇచ్చే నిదులను సొంత ప్రచారానికి వాడుకున్నారని విమర్శలు చేసిన వైసీపీ అధికారంలోకి వచ్చే అదే ఫార్ములాను అమలు చేస్తోంది.

Next Story
Share it