సీఎంపై వ్యాఖ్యలు..ఇంజనీర్ సస్పెండ్

సోషల్ మీడియా దెబ్బ మామూలుగా లేదు. ప్రభుత్వ సర్వీసులో ఉన్న వారు కూడా నిబంధనలు పట్టించుకోకుండా వ్యవహరిస్తూ చిక్కుల్లో పడుతున్నారు. తాజాగా ఏపీలో అలాంటిదే ఓ ఘటన జరిగింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయటంతోపాటు ప్రభుత్వ విధానాలను బహిరంగంగా విమర్శించి ఇంజనీర్ ఒకరు సస్పెండ్ అయ్యారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ పోలీస్ హౌసింగ్ కార్పోరేషన్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎంవీ విద్యాసాగర్‌పై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ, సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ సోమవారం సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు.
దుష్ప్రవర్తన, క్రమశిక్షణను ఉల్లంఘించినందుకు సస్పెండ్ చేసినట్లు తెలిపారు. ‘డీఈ విద్యాసాగర్ తన మొబైల్ వాట్సాప్ గ్రూప్‌ల్లో కొన్ని ప్రభుత్వ వ్యతిరేక విషయాలను పోస్ట్ చేశారు. ముఖ్యమంత్రిని అసభ్య పదజాలంతో దూషిస్తూ, రాష్ట్ర ప్రభుత్వ విధానాలను తన వాట్సాప్ గ్రూప్‌లలో విమర్శించారు. మా విచారణలో ఆధారాలతో సహా అవన్ని వాస్తవమని తేలాయి. ఉద్యోగులు ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో లేదా బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదు. అతిక్రమిస్తే రాష్ట్ర ప్రభుత్వ ప్రవర్తనా నియమావళి ప్రకారం క్రమశిక్షణా చర్యలు తీసుకుంటాం’ అని వెల్లడించారు.