Telugu Gateway
Andhra Pradesh

ప్రజా రవాణా రంగంపై ఆంక్షలను తొలగించాలి

ప్రజా రవాణా రంగంపై ఆంక్షలను తొలగించాలి
X

దేశంలో ప్రజా రవాణా రంగంపై ఉన్న ఆంక్షలను తొలగించాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కోరారు. దీంతోపాటు షాపింగ్ సెంటర్లు కూడా ఓపెన్ చేసేందుకు అనుమతించి భౌతికదూరం పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు. లాక్ డౌన్ నిరంతర కొనసాగింపు ఆర్ధిక వ్యవస్థను దెబ్బతీస్తుందని తెలిపారు. కరోనా కారణంగా రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి దారుణంగా దెబ్బతిన్నందున కేంద్రం సాయం చేయాలని కోరారు. ప్రధాని నరేంద్రమోడీ దేశంలోని ముఖ్యమంత్రులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రస్తావించిన అంశాలు ఇవి. ‘వలస కార్మికులైనా, విధులకు హాజరయ్యే వారైనా సరే.. వారికి ప్రజా రవాణా అందుబాటులోకి తీసుకు రాలేకపోతే.. ఆర్థిక వ్యవస్థ మళ్లీ సాధారణ స్థితికి చేరుకోదు. వివిధ రాష్ట్రాల్లోని పరిశ్రమల్లో పని చేస్తున్న కూలీలు తిరిగి తమ స్వస్థలాలకు వెళ్లిపోవడం చూస్తున్నాం. వారు తాము పని చేసిన చోటుకి తిరిగి రాకపోతే సాధారణ పరిస్థితులు తిరిగి రావు. వారిలో భయం, ఆందోళన తొలగిపోవాలి. బస్సుల్లో సరిపడినంత భౌతిక దూరం పాటించాలి. ప్రజారవాణాలో మాస్కులు, శానిటైజర్లు తప్పనిసరి చేయాలి. షాపింగ్‌ సెంటర్లు కూడా తెరుచుకునేందుకు అవకాశం కల్పిస్తూనే భౌతిక దూరం పాటిస్తూ, మాస్క్‌ లు ధరించేలా చూడాలి.

అలాగే గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ప్రజల్లో భయం ఆందోళన తొలగించడం ద్వారానే సాధారణ పరిస్థితులు తేవాలి. రాష్ట్రంలో మూడు పర్యాయాలు సమగ్ర సర్వే నిర్వహించాం. దాదాపు 30 వేల మందిలో కరోనా లక్షణాలు కనిపించడంతో, వారందరికీ పరీక్షలు నిర్వహించాం. ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు, వలంటీర్ల ద్వారా సర్వే కొనసాగించాం. 6 వారాల లాక్‌డౌన్‌ పరిస్థితులను సమీక్షించుకుంటే.. సాధారణ పరిస్థితులు నెలకొనే దిశలో చర్యలు తీసుకోవాల్సి ఉంది. కరోనా లక్షణాలు కనిపిస్తే స్వయంగా చెప్పడం, వైద్య సహాయం పొందడం, తమంతట తాముగా ఐసొలేషన్‌కు వెళ్లడం వంటివి కొనసాగాల్సి ఉంది. దాదాపు 98 శాతం కేసులు నయం చేయగలమన్న దానిపై ప్రజలకు అవగాహన కల్పించాల్సి ఉంది. 85 శాతం కేసుల్లో స్వల్ప లక్షణాలు మాత్రమే కనిపిస్తున్నాయి. కరోనాకు వ్యాక్సిన్‌ కనుక్కొనే వరకు ఆ వైరస్‌లో మనం కలిసి ముందుకు సాగాల్సి ఉందన్న విషయంపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సి ఉంది. అవసరమైన శాంపిల్‌ కలెక్షన్‌ సెంటర్లు, కోవిడ్‌–19 సెంటర్లు ఏర్పాటు చేయడం ద్వారా, కరోనా వ్యాధి లక్షణాలు కనిపించిన ప్రజలు ఎలాంటి భయం, సంకోచం లేకుండా తమంతట తాము స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పరీక్ష చేయించుకోవడం, వైద్యం పొందేలా ప్రోత్సహిస్తున్నాం.

కోవిడ్‌ నివారణ చర్యల్లో భాగంగా ఆస్పత్రుల్లో పడకలు పెంచాం. ఐసీయూ బెడ్లు కూడా చాలా ఏర్పాటు చేశాం. కానీ వాటిని ఇంకా ఇంకా పెంచాల్సి ఉంది. తయారీ రంగం పుంజుకోవాలంటే ముడిసరుకులు అందడం, ప్రజల రాకపోకలు (మూమెంట్‌) అనేది చాలా అత్యవసరం. సరుకుల రవాణాకు అనుమతించినప్పటికీ చాలా రాష్ట్రాల్లో అవరోధాలు ఏర్పడుతున్నాయి. ఏపీలో తయారీ రంగం పూర్తిగా స్తంభించిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా పైన పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అయినా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పంటకూ కనీస మద్దతు ధర ప్రకటించింది. రాష్ట్రాల మధ్య రవాణాకు సంబంధించి పూర్తి అవరోధాలు తొలగిపోవాలి. ఆస్పత్రులు, ఆరోగ్య మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి కనీసం రూ.16 వేల కోట్లు ఖర్చు అవుతుంది. ఈ లక్ష్యాన్ని సాధించాలంటే ఈ విషయంలో కొత్త రాష్ట్రంగా మాకు కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం కావాలి, కేంద్రం నిధులు ఇవ్వాలి. దీనికి తోడు.. వడ్డీలు లేని లేదా వడ్డీలు తక్కువగా ఉండే దీర్ఘకాలిక చెల్లింపుల ప్రాతిపదికన రుణాలు ఇవ్వాలి. గ్రామ స్థాయి నుంచి బోధనాసుపత్రుల వరకూ ఆస్పత్రులన్నింటినీ కూడా జాతీయ ప్రమాణాల స్థాయికి అభివృద్ది చేయాలనే లక్ష్యాన్ని సులభంగా చేరుకుంటాం. ప్రజారోగ్య రంగాన్ని బలోపేతం చేయడానికి ఇచ్చే ఈ రుణాలను ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిలోకి తీసుకురాకుండా ఉండాలని కోరుతున్నాం’ అని తెలిపారు.

Next Story
Share it