కరోనాకు కులం లేదు..మతం లేదు..దేశం లేదు

కరోనా బాధితులపై ప్రజలంతా అప్యాయత చూపించాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇలాంటి సమయంలో ఒకరికి ఒకరు తోడుగా ఉండాలన్నారు. ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించినట్లుగా ఆదివారం రాత్రి దీపాలు వెలిగించి మన సమైక్యతను చాటాలని కోరారు. ఈ మేరకు జగన్ శనివారం సాయంత్రం ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. జగన్ తన ప్రసంగంలో ప్రత్యేకంగా ఢిల్లీ లో జమాత్ సభకు సంబందించిన అంశాన్ని ప్రస్తావించారు. వారు అక్కడ ఉద్దేశపూర్వకంగా చేసినట్లు అనుకోరాదని, పలానా మతం అని, పలానా కులం అని ముద్ర వేయరాదని జగన్ కోరారు. పండిట్ రవిశంకర్, జగ్గి వాసుదేవ్, పాల దినకరన్ తదితరుల ఆద్యాత్మిక కార్యక్రమాలు జరుగుతుంటాయని ఆయన అన్నారు.
ఏ ఆద్యాత్మిక కేంద్రంలో అయినా జరగవచ్చని, కానీ డిల్లీలో జరిగిన దానికి ఒక వర్గానికి ఆపాదించి మాట్లాడడం సరికాదని జగన్ అన్నారు. అంతా భారతీయులుగానే చూడాలని ,కరోనాపై పోరాడాలని ఆయన సూచించారు.కరోనాకు మతం,కులం తేడాలు ఉండవన్నారు. మనలో మనకు తేడా తెచ్చే యత్నం చేయరాదని,కరోనా కారణంగా మనలో మనకు విబేధాలు పెట్టుకోవద్దని ఆయన అన్నారు. కంటికి కన్పించని వైరస్ పై మనమంతా పోరాట చేయాలన్నారు. ఢిల్లీలోని మర్కజ్ కు వెళ్లిన వారిలో అనేక మందికి కరోనా సోకటం దురదృష్టకరమన్నారు. మనుషులుగా వేరు ఉంటూ మనసులు ఒక్కటిగా కరోనాపై పోరాటం చేయాలన్నారు. భారతీయులుగా పోరాటం చేద్దామన్నారు.