Telugu Gateway
Andhra Pradesh

జగన్మోహన్ రెడ్డి...’ఓ సందేశాత్మక సీఎం’!

జగన్మోహన్ రెడ్డి...’ఓ సందేశాత్మక సీఎం’!
X

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎందుకు ‘సందేశాత్మక సీఎం’ గా మారిపోయారు?. మీడియా సమావేశం పెట్టడానికి ఎందుకు వెనకాడుతున్నారు. సీఎం అయిన తర్వాత ఆయన పెట్టిన మీడియా సమావేశాలే తక్కువ. పెట్టిన ఒకటి అరా కూడా పరిమిత సంఖ్యలో విలేకరులు..పరిమిత సంఖ్యలో మాత్రమే ప్రశ్నలను అనుమతించారు. ఇప్పుడు అవి కూడా తీసేసి వీడియోల ద్వారా మాత్రమే ‘సందేశాలు’ ఇస్తున్నారు. ఏప్రిల్ 1న విలేకరుల సమావేశం అని చెప్పారు కానీ...వీడియో ద్వారానే సందేశం ఇఛ్చారు. శనివారం నాడు కూడా జగన్ వీడియో సందేశం ఇచ్చారు. అది కూడా పూర్తిగా ముందుగా రాసుకున్న స్క్రిప్ట్ ను చదవటానికే పరిమితం అయ్యారు. మీడియా సమావేశాలకు జగన్ ఎందుకు వెనుకాడుతున్నారు. ఇదే ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. జగన్ మీడియాతో మాట్లాడిన పలు సందర్భాల్లో దొర్లిన పొరపాట్లను సోషల్ మీడియాతో పాటు ప్రతిపక్ష టీడీపీ సోషల్ మీడియా వింగ్ పెద్ద ఎత్తున ట్రోల్ చేసింది. చివరకు జగన్ ఎంచుకున్న వీడియో సందేశాల మార్గాన్ని చూస్తే కేవలం సోషల్ మీడియా తాకిడిని చూసే వెనక్కి తగ్గినట్లు కన్పిస్తోందనే విమర్శలు ఉన్నాయి. తిరుగులేని మెజారిటీ ఉన్న ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవటంలో చూపెడుతున్న ఢొల్లతనం కూడా అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

తెలంగాణాలో కరోనా కారణంగా ఆదాయం పడిపోయిందని..ఉద్యోగుల జీతాల్లో 50 శాతం కోత పెట్టారు. ఏపీలో కూడా ప్రజా ప్రతినిధులను మినహాయించి సేమ్ టూ సేమ్ జీవో జారీ చేశారు. తర్వాత విమర్శలు రావటంతో తెలంగాణ సర్కారు కరోనా సమయంలో ప్రాణాలొడ్డి పోరాడుతున్న డాక్టర్లతోపాటు పోలీసులకు కూడా పూర్తి స్థాయిలో వేతనాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. రెండు రోజుల తర్వాత ఏపీ సర్కారు కూడా శనివారం నాడు కూడా సేమ్ టూ సేమ్ అదే నిర్ణయం తీసుకుంది. ఏపీలో కొత్తగా పారిశుద్ధ్య కార్మికులను యాడ్ చేశారు. కరోనాపై డాక్టర్లు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు ముందుండి పోరాడుతున్నారని జగన్మోహన్ రెడ్డి ప్రశంసించారు. ఇందులో ఏ మాత్రం అవాస్తవం లేదు. కానీ రెండు విడతల్లో జీతాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న రోజుకు...శనివారం నాటికి వచ్చిన మార్పు ఏంటి?. వాళ్ళు అప్పుడెలా పనిచేస్తున్నారో...ఇప్పుడు అలాగే చేస్తున్నారు. మార్పు వచ్చింది అల్లా జగన్ నిర్ణయంలోనే. ఒకప్పుడు సరిగా మాట్లాడటం లేదని, మాట్లాడటమే రాదని వైసీపీ నేతలు అందరూ టీడీపీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ ను టార్గెట్ చేసేవారు. ఇఫ్పుడు స్వయంగా ముఖ్యమంత్రే మీడియాకు మొహం చాటేయటం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారుతోంది. ఇలా వీడియోల ద్వారా సందేశాలు ఇచ్చిన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి కొత్త రికార్డు నెలకొల్పనున్నారు.

Next Story
Share it