Top
Telugu Gateway

చైనాపై దూకుడు పెంచిన ట్రంప్

చైనాపై దూకుడు పెంచిన ట్రంప్
X

ఆ దేశానికి నిపుణుల బృందాన్ని పంపుతామని ప్రకటన

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా విషయంలో చాలా దూకుడు ప్రదర్శిస్తున్నారు. తాజాగా మరో సంచలన ప్రకటన చేశారు. కరోనా వైరస్ అంశంపై సమగ్ర విచారణ కోసం ఆ దేశానికి నిపుణుల బృందాన్ని పంపుతామని, ఈ దిశగా ఆలోచిస్తున్నామని సంచలన ప్రకటన చేశారు. చైనా ఆహ్వానించకపోయినా..తాము వెళ్ళాలనుకుంటున్నామని తెలిపారు. చైనాకు వస్తామని కొద్ది రోజుల క్రితమే వారిని కోరామన్నారు. కరోనా వైరస్ చైనా సృష్టే అని తేలితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించిన తర్వాత..ఇప్పుడు ట్రంప్ నిపుణుల బృందం అంశాన్ని తెరపైకి తెచ్చారు. ఈ బృందం ద్వారా తాము వాస్తవాలు ఏమిటో తెలుసుకోవాలనుకుంటున్నామని తెలిపారు.

కరోనా వైరస్ వెలుగుచూసిన వుహాన్ లో ల్యాబ్ నుంచి పొరపాటున వైరస్ బయటకు వచ్చిందని పలు కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. పలు దేశాలు కూడా చైనా తీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. కరోనా వైరస్ కు సంబంధించి ప్రపంచం కాస్త ఊరట పొందిన తర్వాత అందరూ కలసి చైనా విషయంలో దూకుడుగా వెళ్ళటం ఖాయం అనే సంకేతాలు వెలువడుతున్నాయి. అయితే ఈ ప్రత్యేక నిపుణుల బృందం వ్యవహారంపై చైనా ఎలా స్పందిస్తుందో వేచిచూడాల్సిందే. ల్యాబ్ నుంచి వైరస్ లీక్ వార్తలను చైనా ఇఫ్పటికే పలుమార్లు ఖండించిన విషయం తెలిసిందే.

Next Story
Share it