Telugu Gateway
Andhra Pradesh

విజయసాయిరెడ్డి ‘విచిత్ర వాదన’

విజయసాయిరెడ్డి ‘విచిత్ర వాదన’
X

20 నిమిషాల ఫలితం తేడా కోసం 3 కోట్ల అదనపు వ్యయమా?

కరోనా ర్యాపిడ్ కిట్స్ వివాదంపై వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి ‘విచిత్ర వాదన’ను తెరపైకి తీసుకొచ్చారు. ఈ అంశంపై తాజాగా ‘ట్విట్టర్’ వేదికగా స్పందించారు. ట్విట్టర్ లో ఆయన కామెంట్స్ యతాతధంగా ‘శవాల మీద పేలాలు ఏరుకునే పచ్చ మాఫియా ర్యాపిడ్ టెస్ట్ కిట్లపైన ఏడుపు మొదలుపెట్టింది. చత్తీస్ గడ్ 337కు కొంటే మీరు 700 దాకా ఎలా పెడతారని. అవి దేశంలో తయారైనవి. రిజల్ట్ కు 30 నిమిషాలు పడుతుంది. సీఎం జగన్ గారు కొరియా నుంచి తెప్పించినవి 10. నిమిషాల్లో ఖచ్చితమైన ఫలితాలు చూపుతాయి’. అంటే 20 నిమిషాల తేడాకు ఏపీ సర్కారు కోట్ల రూపాయల అదనపు వ్యయం చేయటానికి రెడీ అయిందని విజయసాయిరెడ్డి చెబుతున్నారా?. వాస్తవంగా అదే చత్తీస్ గడ్ కిట్స్ ఏపీ కూడా కొంటే పది నిమిషాల బదులు 30 నిమిషాల్లో ఫలితం వచ్చేది. అయినా రాష్ట్రానికి కోట్ల రూపాయలు మిగిలేవి కదా?. ఓ ఇరవై నిమిషాల వ్యవధిలో ఫలితం తేడాతో పెద్దగా నష్టమేమీ ఉండదు. కానీ కిట్స్ కొనుగోలులో జరిగిన పొరపాట్లను కప్పిపుచ్చుకునేందుకు పది నిమిషాల్లో ఫలితాలు వస్తాయనే వాదనను విజయసాయిరెడ్డి తెరపైకి తెచ్చినట్లు కన్పిస్తోంది.

వాస్తవానికి ప్రభుత్వం తొలి దశలో ఆర్డర్ ఇచ్చింది రెండు లక్షల కిట్లకు. అందినవి లక్ష కిట్లు వచ్చాయి. అది కూడా ఒక్కో కిట్ కు 730 రూపాయలు అని ఆర్డర్ లో స్పష్టంగా పేర్కొన్నారు. అంటే చత్తీస్ గడ్ కొన్న రేటు ప్రకారం అయితే లక్ష కిట్లకు 3.37 కోట్ల రూపాయలు అయితే.ఏపీ కొన్న రేటు ప్రకారం అయితే 7.30 కోట్ల రూపాయలు అవుతాయి. అంటే విజయసాయిరెడ్డి చెప్పిన దాని ప్రకారం చూసుకున్నా 20 నిమిషాల ఫలితం తేడా కోసం మూడు కోట్ల రూపాయల అదనపు వ్యయం చేయాలా?. ఇదెక్కడి లాజిక్. అంతే కాదు..కిట్స్ కోసం ఆర్డర్ ఇచ్చింది వైద్యఆరోగ్య శాఖ పరిధిలోని సంస్థ. కానీ ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి మాత్రం ఒక్కో కిట్ రేటు 640 రూపాయలు అని తప్పుదారి పట్టించే ప్రయత్నం ఎందుకు చేసినట్లు?. ఇవన్నీ సమాధానం లేని ప్రశ్నలే.

Next Story
Share it