Telugu Gateway
Andhra Pradesh

చంద్రబాబుతో వెంకయ్యనాయుడు చర్చలు

చంద్రబాబుతో వెంకయ్యనాయుడు చర్చలు
X

సుదీర్ఘ విరామం తర్వాత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ఫోన్ లో చర్చలు జరిపారు. దేశాన్ని పట్టిపీడిస్తున్న కరోనా సమస్యపై వెంకయ్యనాయుడు గత కొన్ని రోజులుగా అన్ని రాష్ట్రాల్లోని రాజ్యసభ సభ్యులతోపాటు దేశంలోని ప్రముఖ నేతలు అందరితో మాట్లాడుతున్నారు. అందులో భాగంగానే ఆయన తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుతో కూడా మాట్లాడారు. చంద్రబాబుతో చర్చల సందర్భంగా ఏపీలో కరోనా సమస్యతోపాటు పలు అంశాలు చర్చకు వచ్చినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దేశంలో కరోనా వెలుగు చూసిన తర్వాత చాలా కాలం వరకూ అసలు ఏపీలో పెద్దగా ఈ వైరస్ అలజడే లేదు. కానీ గత కొన్ని రోజులుగా అనూహ్యంగా కరోనా కేసులు ఏపీలో పెరిగిన విషయం తెలిసిందే. ‘మిషన్ కనెక్ట్’ పేరుతో రాజ్యసభ ఛైర్మన్ కూడా అయిన వెంకయ్యనాయుడు ఇఫ్పటికే దేశంలోని రాజ్యసభ సభ్యులు అందరితో మాట్లాడారు. రాజ్యసభ సభ్యులతోపాటు ఆయన గవర్నర్లు, ముఖ్యమంత్రులు, ఇతర రాజకీయ నేతలు, మీడియా ప్రతినిధులతోనూ చర్చలు జరిపి ఆయా రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితులను తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ప్రతి ఒక్కరి కుటుంబంలోని సభ్యులు ఎలా ఉన్నారు అనే అంశంపై ఆరా తీయటంతోపాటు...ఆయా ప్రాంతాల్లో కరోనా వైరస్ విస్తృతి..ఆయా ప్రభుత్వాలు నివారణకు చేపడుతున్న చర్యల గురించి కూడా అడిగి తెలుసుకున్నారు. మార్చి 25 నుంచి వెంకయ్యనాయుడు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రాజ్యసభలో 245 సభ్యులు ఉంటే..ఆయన ఇఫ్పటికే 241 మందితో మాట్లాడారు. ఈ సందర్భంగా కొంత మంది సభ్యులు తదుపరి పార్లమెంట్ సమావేశాలు ఎప్పటి నుంచి ఉంటాయని ఆరా తీయగా..ఇది దేశంలో కరోనా నియంత్రణపై ఆధారపడి ఉంటుందని..క్షేత్రస్థాయిలో పరిస్థితులు మెరుగుపడితే షెడ్యూల్ ప్రకారమే జరిగే అవకాశం ఉందని వెల్లడించారు. రాజ్యసభ సభ్యులతోపాటు వెంకయ్యనాయుడు మాజీ రాష్ట్రపతులు ప్రణబ్ ముఖర్జీ, ప్రతిభా పాటిల్ తోపాటు మాజీ ప్రధానులు మన్మోహన్ సింగ్, హెచ్ డి దేవేగౌడతో కూడా మాట్లాడారు.

Next Story
Share it