జగన్ ప్రయత్నాలు పలించలేదు..కానీ శ్రీనివాసరాజుకు ఓకే అయింది

తెలంగాణ కు డెప్యుటేషన్ పై టీటీడీ మాజీ జెఈవో
ఓ ఐపీఎస్ అధికారి కోసం ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రయత్నాలు పలించలేదు. కానీ టీటీడీ మాజీ జెఈవో శ్రీనివాసరాజుకు మాత్రం పని అయిపోయింది. తెలంగాణలో ఉన్న ఐపీఎస్ అధికారి స్టీఫెన్ రవీంద్రను ఏపీకి డెప్యుటేషన్ పై తీసుకెళ్లి అత్యంత కీలకమైన ఇంటెలిజెన్స్ చీఫ్ బాధ్యతలు అప్పగించాలని జగన్ ప్రయత్నించారు. స్టీఫెన్ రవీంద్రతోపాటు శ్రీలక్ష్మి వంటి అధికారులను కూడా ఏపీకి తీసుకెళ్లాలని తలిచారు. కానీ అంతర్ రాష్ట్ర డెప్యుటేషన్ కు కేంద్రం ససేమిరా అనటంతో ఇవి అన్నీ పక్కన పడిపోయాయి. కానీ ఇప్పుడు ఆకస్మాత్తుగా ఏపీ క్యాడర్ అదికారి అయిన శ్రీనివాసరాజును తెలంగాణకు డెప్యుడేషన్ పై రావటానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ కేంద్రం ఆదేశాలు ఇవ్వటం ఆసక్తికరంగా మారింది. అయితే ఇందుకు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతి ఇచ్చాయి.
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) జెఈవో సుదీర్ఘకాలం పనిచేసిన ఐఏఎస్ అధికారి కె ఎస్ శ్రీనివాసరాజు ఏపీ క్యాడర్ నుంచి తెలంగాణ క్యాడర్ కు డెప్యుటేషన్ పై వచ్చారు. ఈ మేరకు కేంద్రం బుధవారం నాడు ఆదేశాలు జారీ చేసింది. ఈ డెప్యుటేషన్ మూడేళ్ల పాటు అమల్లో ఉంటుందని ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు.2001 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారి అయిన శ్రీనివాసరాజు ను అఖిల భారత అధికారుల సర్వీసు నిబంధనలు 1954లోని సెక్షన్ 6(1) ప్రకారం డెప్యుటేషన్ పై పంపిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.