టాలీవుడ్ కూ ‘సినిమా’ చూపిస్తున్న కరోనా
ఆగిపోయిన ప్రాజెక్టుల విలువ 600 కోట్ల రూపాయలు!
సినిమాలకు మళ్ళీ ‘ముహుర్తం’ ఎప్పుడు?
టాలీవుడ్ అందరికీ సినిమాలు చూపిస్తుంది. కానీ టాలీవుడ్ కే సినిమా చూపిస్తోంది ‘కరోనా’. కరోనా వైరస్ కారణంగా ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమ కూడా చిక్కుల్లో పడింది. ఎంతగా అంటే ఏకంగా 50 సినిమాలు ఆగిపోయాయి. సుమారు 600 కోట్ల రూపాయల వరకూ పెట్టుబడులు ఇరుక్కుపోయాయి. ఈ లాక్ డౌన్ ఎప్పుడు ఎత్తేస్తారు?. మళ్ళీ సినిమాలకు ఎప్పుడు ‘ముహుర్తం’ కుదురుతుందో తెలియని పరిస్థితి. ప్రస్తుతం టాలీవుడ్ తో పాటు అన్ని రంగాల్లోనూ అనిశ్చితి రాజ్యమేలుతోంది. దర్శక దిగ్గజం రాజమౌళి సుమారు 300 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీతోపాటు చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమాల షూటింగ్ లు వివిధ దశల్లో ఆగిపోయాయి. వీటితో పాటు మరెన్నో ప్రాజెక్టులు కూడా కరోనా కారణంగా నిలిచిపోయాయని..ఈ మొత్తం ప్రాజెక్టు ల విలువ సుమారు 600 కోట్ల రూపాయల వరకూ ఉండొచ్చని తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్ సి. కళ్యాణ్ ‘పీటిఐ’కి తెలిపారు.
సినీ పరిశ్రమ భవిష్యత్ గురించి ఇప్పుడే ఓ అంచనా రావటం కష్టమేనన్నారు. ఏటా టాలీవుడ్ సుమారు 200 సినిమాలను తెరకెక్కిస్తాయన్నారు. లాక్ డౌన్ కారణంగా తెలుగు సినీ పరిశ్రమ నష్టాలు ఎంత మేర ఉంటాయనేది ఇప్పుడే అంచనా వేయలేమని, కాకపోతే ఇది పరిశ్రమకు మాత్రం పెద్ద దెబ్బగా మిగలబోతుందని ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు తెలిపారు. సినిమాల్లో జాప్యానికి సంబంధించి తమకు బీమా సౌకర్యం ఉన్నా..కరోనా వైరస్ కొత్తగా వచ్చింది కాబట్టి ఈ క్లైయిమ్స్ ను బీమా కంపెనీలు ఎంత మేరకు ఆమోదిస్తాయో వేచిచూడాల్సి ఉందన్నారు. లాక్ డౌన్ ఎత్తేసినా ఇఫ్పటికిప్పుడు సినిమా హాళ్ళకు అనుమతులు ఇవ్వటం అనుమానమే అన్నారు సురేష్ బాబు. ఒక్క మాటలో చెప్పాలంటే సినీ పరిశ్రమకు సంబంధించి ఒక ఆర్ధిక సంవత్సరం పూర్తిగా పోయినట్లేనన్నారు. సినీ పరిశ్రమ నష్టం ఒకెత్తు అయితే పరిశ్రమపై ఆధారపడిన సుమారు ఎనిమిది వేల మంది వరకూ ఉపాధి కోల్పోయారని ప్రముఖ నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ తెలిపారు.