టాలీవుడ్ కు ‘కరోనా సవాల్’
కరోనా దెబ్బకు సినీ పరిశ్రమ విలవిలలాడుతోంది. ఓ వైపు షూటింగ్ లు ఎక్కడివి అక్కడే ఆగిపోవటం ఒకెత్తు అయితే..ఇప్పటికే రెడీ అయిన సినిమాల విడుదల కూడా ఓ పెద్ద సమస్యగా మారింది. లాక్ డౌన్ ఎప్పుడు ఎత్తేస్తారో తెలియదు..లాక్ డౌన్ ఎత్తేసినా థియేటర్లకు అనుమతులు ఎప్పుడు నుంచి వస్తాయి. సినిమా విడుదల ఎప్పటి నుంచి ప్రారంభం అవుతుంది. ఇవన్నీ ప్రస్తుతానికి సమాధానం లేని ప్రశ్నలే. కరోనా ప్రభావం ఇప్పటికిప్పుడు సమసిపోదని..థియేటర్లు తెరిచినా ప్రేక్షకుల రాక ఎంత వరకూ ఉంటుందనే అంశంపై కూడా రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. ఇప్పటికే రెడీ అయిన సినిమాలను జాప్యం అయినా సరే థియేటర్లలోనే విడుదల చేయాలని హీరోలతోపాటు నిర్మాతలు కూడా భావిస్తున్నారు. కానీ జరుగుతున్న జాప్యం కొంత మందిలో టెన్షన్ రేపుతోంది.
కొన్ని కొత్త సినిమాలను కూడా విడుదల చేసేందుకు పలు ఓటీటీ సంస్థలు ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. తాజాగా ఆ జాబితాలో అనుష్క నటించిన నిశ్శబ్దం పేరు కూడా ప్రచారంలోకి వచ్చింది. అయితే ఈ అంశంపై చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చింది. ఓటీటీ విడుదల వార్తల్లో ఏ మాత్రం నిజంలేదని..ఏదైనా ఉంటే తామే అధికారికంగా ప్రకటిస్తామని వెల్లడించింది. అప్పటి వరకూ పుకార్లను విశ్వసించవద్దని కోరింది. వాస్తవానికి కరోనా దెబ్బ లేకుండా ఉండి ఉంటే ఈ సినిమా ఏప్రిల్ 2న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో విడుదల కావాల్సి ఉంది.