లాక్ డౌన్ నెలాఖరు వరకూ పొడిగించాలి

తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు గురువారం నాడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పొలిట్ బ్యూరో సమావేశం నిర్వహించారు. చంద్రబాబు హైదరాబాద్ లో, పార్టీ నేతలు ఏపీలో ఉండటంతో ఈ మార్గాన్ని ఎంచుకున్నారు. దేశంలో కరోనాను సమర్ధవంతంగా నిరోధించేందుకు లాక్ డౌన్ ను ఈ నెలాఖరు వరకూ పొడిగించాలని కేంద్రాన్ని కోరుతూ టీడీపీ పొలిట్ బ్యూరో తీర్మానం చేసిందని ఆ పార్టీ నేత కాలువ శ్రీనివాసులు తెలిపారు. పొలిట్ బ్యూరో సమావేశం వివరాలను ఆయన మీడియాకు వివరించారు. సీఎం జగన్ అసమర్థత వల్ల రైతులు నష్టపోతున్నారని విమర్శించారు. ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి రైతుల్ని ఆదుకోవాలని, కూలీలు, పేదలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
రూ.5 వేలు ఇవ్వాలని కేంద్రం చెబుతున్నా అరకొర సాయంతో ప్రభుత్వం చేతులు దులుపుకుందని ధ్వజమెత్తారు. మెడ్‌టెక్ జోన్ ఫలితం దేశమంతా ఉపయోగపడుతోందని తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబు ముందుచూపును టీడీపీ పొలిట్‌బ్యూరో అభినందించిందని తెలిపారు. కరోనాతో మృతిచెందిన వారి కుటుంబాలకు రూ.25 లక్షలు ఇవ్వాలని, కరోనా వైద్యసేవలు అందిస్తూ మృతిచెందిన వారి కుటుంబాలకు రూ.50 లక్షలు ఇవ్వాలని కాల్వ శ్రీనివాసులు కోరారు. రైతుల కరెంట్, నీటి బిల్లులను రద్దు చేయాలని, ఇతర రాష్ట్రాలు, దేశాల్లో చిక్కుకున్న తెలుగువారిని ఆదుకోవాలన్నారు.