Telugu Gateway
Politics

కెసీఆర్..కెటీఆర్ లపై రేవంత్ సంచలన ఆరోపణలు

కెసీఆర్..కెటీఆర్ లపై రేవంత్ సంచలన ఆరోపణలు
X

కరోనా సంక్షోభ సమయంలోనూ సొంత కంపెనీల ప్రయోజనాలేనా?

ప్రధాని నరేంద్రమోడీకి కూడా కరోనాపై సలహాలు..సూచనలు ఇస్తున్నట్లు బయటకు చెబుతున్న ముఖ్యమంత్రి కెసీఆర్ ఈ సంక్షోభ సమయంలో సొంత ప్రయోజనాలకే పెద్ద పీట వేస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. తన కొడుకు బావమరిది కంపెనీ కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టుపెట్టారని ఆరోపించారు. ఓ వైపు ప్రజల కోసం కేంద్రంతో మాట్లాడుతున్నట్లూ చెబుతూ వాస్తవానికి బంధువుల కంపెనీకి కాంట్రాక్టులు, ఒప్పందాలు చేసి పెట్టే రాచకార్యం వెలగబెడుతున్నారని విమర్శించారు. ఇలా చేయటం ద్వారా కేంద్రం ప్రకటించిన ప్రోత్సాహక సొమ్మును అప్పనంగా కొట్టేయటానికి సిద్ధపడ్డారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి గురువారం నాడు మీడియాతో మాట్లాడుతూ లెక్సాయ్ లైఫ్ సెన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి చెందిన అంశాల గురించి ప్రస్తావించారు. తన కుమారుడి బావమరిది అయిన రాజ్ పాకాల కళ్ళలో ఆనందం చూడటానికే కెసీఆర్ అడ్డదారి తొక్కారన్నారు.

చైనా దిగుమతులను తగ్గించి ఫార్మా రంగానికి అవసరమైన ముడిపదార్ధాలను దేశంలోనే తయారు చేసుకోవాలని ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. దీని కోసం భారీ ఆర్ధిక ప్యాకేజీని కూడా ప్రకటించారు. ఇందులో భాగంగానే రాష్ట్రంలోని ఓ అనామక కంపెనీకి, ఫార్మా రంగంలో ఏ మాత్రం గుర్తింపులేని సంస్థకు ఫార్మా రంగానికి అవసరమైన ముడి ఉత్పత్తులు తయారు చేసే అవకాశం కల్పించారు. దీని కోసం కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ)తో కూడా ఒఫ్పందం కుదిర్చారు. ఇప్పటివరకూ ఎక్కడా వినపడని కంపెనీ అయిన లెక్సాయ్ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. దీనికి కారణం ఇది ముఖ్యమంత్రి తనయుడు, మంత్రి కెటీఆర్ బావమరిది అయిన పాకాల రాజేంద్రప్రసాద్ సంస్థ కావటమే అని రేవంత్ తెలిపారు. 2007లో ఈ సంస్థ ఏర్పాటు అయితే కెటీఆర్ బావమరిది పాకాల రాజేంద్రప్రసాద్ ఇందులో 2018 ఏప్రిల్ 30న డైరక్టర్ గా చేరాడని వెల్లడించారు. ఆ తర్వాతే కంపెనీ దశ తిరిగిందని..ఎక్కడ లేని ఆర్ధిక ప్రయోజనాలు, ఎన్నడూ రాని అనుమతులు ఆ కంపెనీకి వచ్చి పడుతున్నాయని రేవంత్ తెలిపారు.

కేంద్ర ప్రభుత్వ సంస్థతో ఒప్పందం చేయించటం ద్వారా కంపెనీకి భారీ ఎత్తున లబ్ది చేకూర్చనున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఇది సీఎం కెసీఆర్ మంత్రాంగంతోనే సాధ్యమైందని తెలిపారు. రాష్ట్రంలోని రైతులకు సంబంధించి చివరకు గన్నీ బ్యాగులతో పాటు ఎలాంటి ప్రయోజనాలు సాధించలేని కెసీఆర్ తన కొడుకు బావమరిది కంపెనీ కోసం మాత్రం తన పరపతిని ఉపయోగించి లబ్ది చేకూర్చిపెట్టారన్నారు. లాక్సాయ్ కు వచ్చిన అనుమతులు చూసిన తర్వాత కెసీఆర్ కేంద్రాన్ని ఏమి అడిగారో...కేంద్రం ఏమి ఇఛ్చిందో అర్ధం అవుతుందన్నారు. కరోనా సంక్షోభ సమయంలో సొంత ఆర్ధిక ప్రయోజనాలు, కొంత కంపెనీల కోసం కోసం చీకటి ఏజెండాలతో వెళ్లే వాళ్ళను ఏమి చేయాలో ప్రజలే ఆలోచించుకోవాలని రేవంత్ వ్యాఖ్యానించారు.

Next Story
Share it