Telugu Gateway
Andhra Pradesh

ఏపీలో 78 బాటిళ్ళ ‘మందు’ తాగిన ఎలుకలు

ఏపీలో 78 బాటిళ్ళ ‘మందు’ తాగిన ఎలుకలు
X

ఇది ఓ కరోనా విచిత్రం. ఆంధ్రప్రదేశ్ లో ఎలుకలు మందుకు బాగా అలవాటు పడిపోయినట్లున్నాయి. అలా ఇలా కాదు..ఏకంగా పలు షాప్ లో 78 బాటిళ్లు తాగేశాయంట. ప్రకాశం జిల్లా అద్దంకి పరిధిలో ఈ ఎలుకల మందు సిట్టింగ్ ఏ రేంజ్ లో ఉందో ఊహించుకోవచ్చు. అంటే లాక్ డౌన్ ఉన్న గత నెల రోజులుగా ఎలుకలు అద్దంకిలోని వైన్ షాప్ ల్లో ప్రతి రోజూ సిట్టింగ్ వేసుకుని మందుకొట్టాయన్న మాట. పాపం వాటికి మంచింగ్ ఎక్కడ దొరికిందో. లేక కరోనా కష్ట కాలంలో మందు దొరకటమే మహాభాగ్యం అనుకుని ఈ జీవితానికి ఇది చాలు అనుకుని సంతృప్తి చెంది ఉంటాయి. చదవటానికి ఇది కామెడీగా ఉన్నా ఏపీలో నిజంగా జరిగిన సంఘటన ఆ మద్యం షాపుల వాళ్లు ఎక్సైజ్ అధికారులకు చెప్పారు. ఏపీలో జగన్ సర్కారు వచ్చిన తర్వాత మద్యం దుకాణాలు అన్నీ సర్కారు పరం అయిన విషయం తెలిసిందే. అందులో సడన్ గా లాక్ డౌన్ వచ్చి పడింది. బయట ఎక్కడా మందు దొరకని పరిస్థితి. మందుకు అలవాటు పడిన బాబులు బాటిల్ ఇస్తే చాలు ఎంత ధర అయినా ఇవ్వటానికి రెడీగా ఉంటారు. ఈ సమయంలో. ఇదే అదనుగా షాప్ ల్లో పనిచేసిన వారే ఓ 78 బాటిళ్ళను బయట అమ్మేసుకుని నెపాన్ని ‘ఎలుకల’పై నెట్టేశారనే విషయం అర్ధం అవుతోంది.

కాకపోతే అధికారుల తనిఖీల్లోనే ఈ విషయం బయటపడింది. కొన్ని చోట్ల ఎక్సైజ్ అధికారులు తమ వాహనాల్లో మందు బాటిళ్లను తరలిస్తూ కూడా పట్టుబడి సస్పెండ్ అయ్యారు. ప్రైవేట్ షాప్ లు అయితే కొంతలో కొంత ప్రైవేట్ గా అయినా మద్యం దొరికే వెసులుబాటు ఉండేది. సర్కారు షాప్ లు కావటం మద్యం బయటకు రావటం కష్టం అనుకున్నారు. కాకపోతే ఇలా ఎలుకలే ఏకంగా 78 బాటిళ్లు తాగాయంటే ..ఎలుకలా ..మజాకానా అనుకోవాల్సిందే. ఒక్క అద్దంకిలోనే 78 బాటిళ్ళు ఎలుకలు తాగితే రాష్ట్రవ్యాప్తంగా మద్యం షాపుల తనిఖీలు జరిగితే ఇంకా ఎన్ని వింత జీవులు మందు తాగి ఉంటాయో. కొన్ని చోట్ల పిల్లులు కూడా ఈ మందు పార్టీల్లో పిల్లులు కూడా పార్టిసిపేట్ చేసి ఉండొచ్చు. ఇంకా తనిఖీలు జరిగితే కానీ అది బయటకు రాదు.

Next Story
Share it