Telugu Gateway
Andhra Pradesh

ఏపీ ర్యాపిడ్ కిట్స్ వివాదం..సమాధానం లేని ప్రశ్నలెన్నో!

ఏపీ ర్యాపిడ్ కిట్స్ వివాదం..సమాధానం లేని ప్రశ్నలెన్నో!
X

ఏపీ సర్కారు కరోనా టెస్ట్ ల కోసం దిగుమతి చేసుకున్న ర్యాపిడ్ కిట్స్ వ్యవహారం మలుపుల మీద మలుపులు తిరుగుతోంది. ఈ కిట్స్ ధర అంశం పెద్ద వివాదంగా మారటంతో సర్కారులోని పెద్దలు రకరకాలుగా స్పందిస్తూ అనుమానాలు మరింత పెంచేలా వ్యవహరిస్తున్నారు. ఏపీ సర్కారు ఈ కిట్స్ సరఫరా చేయాల్సిందిగా ఆర్డర్ ఇచ్చింది సండూర్ మెడికెయిడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు. రెండు లక్షల కిట్లు సరఫరా చేయాలి..ఒక్కో కిట్ దర 730 రూపాయలకు. జీఎస్టీ కాకుండా అని ఆర్డర్ లో పేర్కొన్నారు. చత్తీస్ గడ్ 337 రూపాయలకు కిట్స్ కొనుగోలు చేసిందని వార్తలు రావటంతోనే ఒక్కసారి ఈ అంశంపై దుమారం చెలరేగింది. ఈ అంశంపై దుమారం రేగటంతో ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ (ఏపీఎంఎస్ఐడీసీ) తాము ఆర్డర్ ఇఛ్చిన సండూర్ మెడికెయిడ్స్ కు లేఖ రాసింది.

కొనుగోలు ఒప్పందంలోని నిబంధన ప్రకారం దేశంలోని ఏ ఇతర సంస్థలకైన తమకు కోట్ చేసిన తక్కువ ధరకు సరఫరా చేస్తే తమకు కూడా అదే రేటు ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొన్నామని..దీని ప్రకారమే తాము కూడా చత్తీస్ గడ్ మెడికల్ సర్వీసెస్ కార్పొరేషన్ లిమిటెడ్ కొనుగోలు చేసిన 337 రూపాయల ధర మాత్రమే చెల్లిస్తామని పేర్కొంది. ఇక్కడే అసలు కిటుకు ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. అవేంటో మీరూ ఓ లుక్కేయండి.

  1. ఏపీ ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చింది సండూర్ మెడికెయిడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు. కానీ చత్తీస్ గడ్ కు కిట్స్ సరఫరా చేసింది భారత్ లోని ఎస్ డి బయోసెన్సార్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్.
  2. ప్రభుత్వం విడుదల చేసిన కొనుగోలు ఆర్డర్ కాపీలో తమకు కోట్ చేసిన ధర కంటే తక్కువ ధరకు కిట్స్ సరఫరా చేస్తే ఆ మొత్తాన్ని రికవరి చేస్తామని పేర్కొన్నారు.
  3. అంటే ఆర్డర్ దక్కించుకున్న సండూర్ మెడికెయిడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఏపీకి ఇచ్చిన రేటు కంటే తక్కువ ధరకు ఇతర రాష్ట్రాలకు, లేదా ఎవరికైనా సరఫరా చేస్తే ఈ నిబంధన వర్తిస్తుంది కానీ.. ఎస్ డి బయోసెన్సార్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ రేటుకు..ఈ కంపెనీకి సంబంధం ఏమి ఉంటుంది.
  4. సండూర్ మెడికెయిడ్స్ నుంచి కొటేషన్ తీసుకుని తీసుకుని నేరుగా ఆర్డర్ ఎలా ఇచ్చారు?. కనీసం ఈ కిట్స్ సరఫరా కోసం షార్ట్ టెండర్లు ఎందుకు పిలవలేదు?
  5. ఆర్డర్ లోనే స్పష్టంగా 730 రూపాయలు, జీఎస్టీ కాకుండా అని చెప్పి ఇప్పుడు చత్తీస్ గడ్ రేటే చెల్లిస్తామంటే సాధ్యం అవుతుందా?. చట్టప్రకారం నిలబడుతుందా?. ఇది తాత్కాలిక ఉపశమన చర్యా?
  6. ఒప్పందం సండూర్ తో..రేటు ఎస్ డి బయోసెన్సార్ హెల్త్ కేర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ది అంటే జరిగే పనేనా?.
  7. దక్షిణ కొరియాకు చెందిన ఈ కంపెనీ భారత్ లో కార్యకలాపాలు ప్రారంభించి దాదాపు ఏడేళ్లు కావస్తోంది. అసలు నేరుగా కొరియా అనుబంధ సంస్థతో మాట్లాడకుండానే సండూర్ మెడికెయిడ్స్ కు ఆర్డర్ ఇవ్వటం వెనకాల మతలబు ఏంటి?
  8. ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసిన ప్రెస్ నోట్ లో ర్యాండమ్ మెడికెయిడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరక్టర్ రాజీవ్ సింథి, డైరక్టర్ మురళీధర్ లు సీఎం జగన్మోహన్ రెడ్డికి కిట్స్ అందించారని తెలిపారు.
  9. కానీ వాస్తవానికి సర్కారు ఆర్డర్ ఇచ్చింది సండూర్ మెడికెయిడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు..మరి ర్యాండమ్ మెడికెయిడ్స్ కంపెనీ ఎక్కడిది? ఎలా తెరపైకి వచ్చింది? అసలు ఆ కంపెనీ అనేది ఒకటి ఉందా?. లేకపోతే సీఎంవో నోటులో ఆ పేరు ఎలా వచ్చింది?
  10. వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి ఏపీ దిగుమతి చేసుకున్న కిట్స్ కు, చత్తీస్ గడ్ కిట్స్ కు తేడా ఉందని ట్వీట్ చేశారు. చత్తీస్ గడ్ కిట్ ఫలితం 30 నిమిషాల్లో వస్తుందని..సీఎం జగన్ ఓకే చేసిన కిట్ 10 నిమిషాల్లోనే ఫలితాన్ని తేల్చేస్తుందని అందుకే 700 రూపాయలు అని ప్రకటించారు.
  11. విజయసాయిరెడ్డి రేటును సమర్ధిస్తూ గట్టిగా ట్వీటారు. కానీ సర్కారు గంటల వ్యవధిలోనే అంతా తూచ్ ..మాది కూడా అదే రేటు..చత్తీస్ గడ్ రేటు అని ఎలా చెబుతుంది. మరి తప్పు విజయసాయిరెడ్డిదా?. సర్కారుదా?
  12. వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి సర్కారు ఒప్పందం చేసుకున్న కిట్ ధర 730 రూపాయలు అయితే మీడియా సాక్షిగా 630 రూపాయలు అని ఎలా చెప్పినట్లు?
  13. ఉప ముఖ్యమంత్రి, ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఇదే అంశంపై క్లారిటీ ఇస్తూ ఒప్పందంలోని క్లాజు ప్రకారం... సదరు కంపెనీ ఎక్కడైనా తక్కువ ధరకు అమ్మినా, లేదా తన అనుబంధ సంస్థలద్వారా ఇంతకంటే తక్కువ ధరకు విక్రయించినా, ఆ డిఫరెన్స్‌ మొత్తాన్ని తుది బిల్లునుంచి మినహాయించుకుంటామని స్పష్టంగా పేర్కొన్నాం. దీనికి కంపెనీ అంగీకరించిన మీదటే పర్చేజ్‌ ఆర్డర్‌ రిలీజ్‌ చేయడం జరిగిందన్నారు.’.
  14. అంటే ఈ నిబంధన సండూర్ మెడికెయిడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు వర్తిస్తుంది కానీ..దక్షిణ కొరియాకు చెందిన కంపెనీకి, దాని అనుబంధ సంస్థలకు ఏమి సంబంధం ఉంటుంది?. ఇవి అన్నీ సమాధానం లేని ప్రశ్నలే?

Next Story
Share it